helth camp
-
గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు
యాచారం(ఇబ్రహీంపట్నం): కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కామినేని ఆస్పత్రి వైద్య బృందం శుక్రవారం యాచారం మండల కేంద్రంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపునకు అపూర్వ స్పందన వచ్చింది. నేటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ (కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి) ఫౌండేషన్ యాచారంలో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల కిందట మంచాల మండలం లోయపల్లి గ్రామంలో గుండె జబ్బు కారణంగా శ్రీను మృతితో తీవ్రంగా కలత చెందిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (కేసీఆర్ ఫౌండేషన్ చైర్మన్) ఈ ప్రాంతంలో గుండె జబ్బులున్న వారు అధికంగా ఉన్నారని గుర్తించి యాచారంలో ప్రత్యేకంగా గుండె జబ్బు, క్యాన్సర్ రోగాల నిర్ధారణ కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ గుండె జబ్బుల నిపుణుడు, కామినేని ఆస్పత్రి సీఈఓ ఆశ్విన్ ఎంషా హాజరవుతున్నట్లు తెలుసుకున్న ప్రజలు పలు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. యాచారం మండలం నుంచే కాకుండా మంచాల, ఇబ్రహీంపట్నం మండల గ్రామాల నుంచి వచ్చారు. గుండె జబ్బులు, క్యాన్సర్‌తో పాటు కాళ్లు, కీళ్లు తదితర రోగాలకు సంబంధించి 700 మందికి పైగా హాజరయ్యారు. వివిధ పరీక్షలు జరిపి గుండె జబ్బులున్నట్లు 8 మందిని గుర్తించారు. గుర్తించిన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు జరిపే విధంగా పేర్లు నమోదు చేసుకున్నారు. పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి కేసీఆర్ ఫౌండేషన్ ఉచితంగా మందులను అందజేసింది. కామినేని ఆస్పత్రికి చెందిన స్త్రీ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో సాయి శరణం ఫంక్షన్ హాల్ నిండిపోయింది. యాచారం సీఐ చంద్రకుమార్, ఎస్సై వెంకటయ్యలు వచ్చి వైద్య శిబిరంలో వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలోనే గుర్తిస్తే మేలు: కామినేని ఆస్పత్రి సీఈఓ అశ్విన్ గుండె నొప్పికి వయస్సుతో సంబంధం లేదు. ఛాతిలో నొప్పి వస్తున్నట్లు తెలిసిన వెంటనే వైద్యులను సంప్రదించాలని, లేదంటే ప్రాణానికే ప్రమాదమని కామినేని ఆస్పత్రి సీఈఓ, గుండె జబ్బుల వైద్య నిపుణుడు ఆశ్విన్ ఎం.షా పేర్కొన్నారు. యాచారంలో కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి హాజరైన ఆయన వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుండె జబ్బులను ముందే గుర్తించి వైద్యం పొందితే ప్రమాదం తప్పుతుందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ ఫౌండేషన్ మెగా హెల్త్ క్యాంపును నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రజాసేవ చేయడం కోసమే ఫౌండేషన్: కంచర్ల ప్రజలకు సేవ చేయడానికే కేసీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. వైద్య శిబిరంలో ఆయన పాల్గొని రోగుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైతన్యం లేని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫ్లోరైడ్, వివిధ రోగాల భారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేయడం కోసమే కేసీఆర్ ఫౌండేషన్‌ను స్థాపించి ఈ రోజు యాచారంలో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏటా ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని కేవలం 5 మంది తమ ఫౌండేషన్ వల్ల ప్రాణాలతో బయటపడితే చాలని అన్నారు. కార్యక్రమంలో నల్లవెల్లి, కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యులు గడల మాధవి, సంధాని, టీఆర్ఎస్ నాయకులు జక్క రాంరెడ్డి, బందె రాజశేఖర్‌రెడ్డి, సతీష్ ముదిరాజ్, మూలకిరణ్గౌడ్, ఆజయ్, భాస్కర్, గడల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
మన చేతిలోనే మన ఆరోగ్యం
మహబూబాబాద్ : మన ఆరోగ్యం మన చేతిలో ఉందని ప్రముఖ ఆరోగ్య సలహాదారుడు వీరమాచినేని రామకృష్ణారావు అన్నారు. స్థానిక గాంధీపార్క్‌లో ఆదివారం రాత్రి ‘మీ ఆరోగ్యం మీ చేతిలోనే..’ అనే అంశంపై ఉచిత అవగాహన సదస్సు జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఆరోగ్య జాగ్రత్తల గురించి తెలిసినా నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఆహార పదార్థాల్లో ఉన్న పోషకాలు, విటమిన్లపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. విటమిన్ డీ కలిగిన బలవర్ధకమైన ఆహారం గుడ్డు తినాలన్నారు. ఎమ్మెల్యే భానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఆస్తుల కన్నా ఆరోగ్యం మిన్నా అన్నారు. కార్యక్రమంలో ఘనపురపు అంజయ్య, పి.పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ డోలి సత్యనారాయణ, రామసాయం వెంకట్‌రెడ్డి, పిల్లి సతీష్, పిల్లి సుధాకర్, వద్దుల సరేందర్రెడ్డి, ప్రభాకర్‌రావు, బోడ్డుపెల్లి ఉపేందర్, వడ్డెబోయిన శ్రీనివాస్, కేదాస్ వాసుదేవ్ పాల్గొన్నారు. -
ఆర్మీ, ఎన్సీసీ విభాగాల్లో ఆరోగ్యం కీలకపాత్ర
కమాండెంట్ కల్నల్ మోనీష్‌గౌర్ తుని రూరల్ : ఆర్మీ విభాగంలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఉందని 18వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ మోనీష్‌గౌర్ అన్నారు. తుని మండలం రాజుపేట శ్రీప్రకాష్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల సంయుక్త వార్షిక శిక్షణ శిబిరంలో శుక్రవారం ఎన్.సూరవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కల్నల్ మోనీష్‌గౌర్ మాట్లాడుతూ ఎన్సీసీ శిక్షణలో కేడెట్లకు తరుచూ గాయాలవుతాయన్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న కేడెట్లు సమర్థంగా విధులు నిర్వర్తించగలరన్నారు. దేశ రక్షణలో నిరంతరం సేవలు అందించే ఆర్మీ విభాగంలో పని చేసేవారందరు ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యమన్నారు. ఆర్మీ ఉద్యోగాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కీలకపాత్ర వహిస్తుందన్నారు. ఎన్సీసీ విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ రాజశేఖర్, మండల వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్, ఇతర వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. ఆరువందల మందికి వైద్య పరీక్షలు చేసినట్టు డాక్టర్ తెలిపారు. శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ ఎన్సీసీ థర్డ్ ఆఫీసర్ ఎం.సతీష్, క్యాంపు డిప్యూటీ కమాండెంట్ ఎం.ఎస్.రావత్, ట్రైనింగ్ ఆఫీసర్ లెఫె్టనెంట్ ఎం.కృష్ణారావు, బీహెచ్ఆర్ఎం నాగర్కోటి, రమణమూర్తి, చీఫ్ ఆఫీసర్ యు.మాచిరాజు, సూపరింటెండెంట్ గుమ్మడి అనిల్ కుమార్, సుబేదర్లు జోగిందర్‌సింగ్, రాంకుమార్, రెడ్డి, కెప్టెన్ ఎం.వి.చౌదరి, లెఫె్టనెంట్ రమణబాబు పాల్గొన్నారు. -
క్షేమంగా వెళ్లిరండి
నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు హజ్ యాత్రికులకు వాక్సినేషన్ కాశిబుగ్గ : ముస్లిం సోదరులు హజ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. వరంగల్ హజ్ సొసైటీ అధ్యక్షుడు సర్వర్ మోహినొద్దీన్ అధ్యక్షతన ఎల్బీనగర్లోని క్రిస్టల్ గార్డెన్లో శనివారం హజ్‌యాత్రికుల కోసం వైద్యశిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా యాత్రికులకు వ్యాక్సిన్లు వేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుధీర్‌బాబు హాజరై, మాట్లాడారు. అల్లా దయతో హజ్ యాత్ర ఆనందకరంగా జర గాలని ఆకాంక్షించారు. యాత్రికులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శిబిరంలో డాక్టర్లు యాకూబ్‌పాషా, సాజిద్, ఖాజాహసన్, సొసైటీ ప్రతినిధులు హుస్సేన్ పాషా, జి.ఫర్మా, సుగుణాదేవి, ఎస్.వాణి, జి.రమాదేవి, మసియొద్దీన్, మౌలానా సఫీయోద్దీన్, ఖాస్మి, యూసఫ్, జావిద్, మినోహజ్, సైఫోద్దీన్, మసూద్, హఫిజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఉచిత మెగా వైద్యశిబిరం
చినకొండేపూడి (సీతానగరం) : మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు జయంతి సందర్భంగా చినకొండేపూడి సూర్యచంద్ర ఇంగ్లిష్ మీడియం స్కూల్లో శనివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబుతోపాటు పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చళ్ళమళ్ళ సుజీరాజు, జిల్లా కార్యదర్శి వలవల వెంకట్రాజులు వైద్యశిబిరం ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు. ఇసుక, వెట్‌మిక్స్ వేసి స్కూల్ గ్రౌండ్‌ను శిబిరానికి వచ్చే వారికోసం అనువుగా తయారు చేశారు. జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధన్వంతరి బ్లడ్‌బ్యాంక్ సౌజన్యంతో జీఎస్ఎల్, బొల్లినేని ఆసుపత్రులకు చెందిన 40 మంది ప్రముఖ వైద్యులు ఈ వైద్యశిబిరంలో పాల్గొంటారు. వైద్య విభాగాలు : వైద్యసేవలందించేందుకు ప్రతి విభాగానికి ఒక రూమ్ ఏర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గుండె, కన్ను, చెవి, ముక్కు, గొంతు, చర్మవ్యాధులు, మూత్రకోశ వ్యాధులు, నరాలు, కిడ్నీ వ్యాధులు, ఛాతి, ఊపిరితిత్తుల వైద్యం, కీళ్లు, ఎముకల విభాగాలుగా ఏర్పాట్లు చేశారు. ఈసీజీ, రక్త పరీక్షలు : రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు చేయడానికి పరికరాలతో నిపుణులు వస్తారు. ఈసీజీ, రక్త పరీక్షలు ఉచితంగా చేస్తారు. శిబిరానికి వచ్చేవారికోసం తాగునీరు, అల్పాహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉచిత వైద్యశిబిరంపై మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆటోలపై గ్రామాల్లో పర్యటిస్తూ, కరపత్రాలు అందిస్తూ, వాల్ పోస్టర్లు అతికిస్తూ ప్రచారం చేశారు.