నేడు ఉచిత మెగా వైద్యశిబిరం
Published Fri, Aug 5 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
చినకొండేపూడి (సీతానగరం) :
మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు జయంతి సందర్భంగా చినకొండేపూడి సూర్యచంద్ర ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో శనివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబుతోపాటు పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి వలవల రాజా, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చళ్ళమళ్ళ సుజీరాజు, జిల్లా కార్యదర్శి వలవల వెంకట్రాజులు వైద్యశిబిరం ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు. ఇసుక, వెట్‌మిక్స్ వేసి స్కూల్ గ్రౌండ్‌ను శిబిరానికి వచ్చే వారికోసం అనువుగా తయారు చేశారు. జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధన్వంతరి బ్లడ్‌బ్యాంక్ సౌజన్యంతో జీఎస్‌ఎల్, బొల్లినేని ఆసుపత్రులకు చెందిన 40 మంది ప్రముఖ వైద్యులు ఈ వైద్యశిబిరంలో పాల్గొంటారు.
వైద్య విభాగాలు :
వైద్యసేవలందించేందుకు ప్రతి విభాగానికి ఒక రూమ్ ఏర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గుండె, కన్ను, చెవి, ముక్కు, గొంతు, చర్మవ్యాధులు, మూత్రకోశ వ్యాధులు, నరాలు, కిడ్నీ వ్యాధులు, ఛాతి, ఊపిరితిత్తుల వైద్యం, కీళ్లు, ఎముకల విభాగాలుగా ఏర్పాట్లు చేశారు.
ఈసీజీ, రక్త పరీక్షలు : రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు చేయడానికి పరికరాలతో నిపుణులు వస్తారు. ఈసీజీ, రక్త పరీక్షలు ఉచితంగా చేస్తారు. శిబిరానికి వచ్చేవారికోసం తాగునీరు, అల్పాహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉచిత వైద్యశిబిరంపై మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆటోలపై గ్రామాల్లో పర్యటిస్తూ, కరపత్రాలు అందిస్తూ, వాల్ పోస్టర్లు అతికిస్తూ ప్రచారం చేశారు.
Advertisement