
హయత్‌నగర్: రోగులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చే ఓ డాక్టర్ తానే మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లెక్చరర్స్ కాలనీలో నివసించే మంతటి మురళీధర్‌రావు కొడుకు రమేష్ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓబుల్‌రెడ్డి ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ (అనస్తీషియన్)గా పనిచేస్తున్నాడు. అతని భార్య స్వప్న కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మద్య తగాదా నడుస్తోంది. గత ఆరు నెలలుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్ లెక్చరర్స్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా.. స్వప్న బీహెచ్‌ఈఎల్‌లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రమేష్ సోమవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులు నిద్రపోయాక డాబాపైకి వెళ్లి మత్తు ఇంజక్షన్ తీసుకున్నాడు, ఉదయం కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.