శ్రీకాంత్ మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న భార్య వీణ బాలకృష్ణన్
నిడదవోలు రూరల్: మండలంలోని తాడిమళ్ల పీహెచ్‌సీ వైద్యాధికారిగా పనిచేసిన పత్తనంక శ్రీకాంత్(32) సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందారు. ఈనెల 1వ తేదీ నుంచి విశాఖపట్టణంలోని కేజీహెచ్‌లో కంటివైద్యనిపుణుడు(ఆప్తమాలజీ)లో శ్రీకాంత్ పీజీ కోర్సు చేస్తున్నారు. నిడదవోలులోని ఆయన నివాసం నుంచి తెల్లవారుజామున విశాఖపట్టణం వెళ్లేందుకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు బైక్‌పై వెళుతుండగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలోని కాటన్‌బ్యారేజిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఈవిషాద వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యలు, నిడదవోలు, తాడిమళ్ల పీహెచ్‌సీ పరిధిలోని వైద్య సిబ్బంది దుఖఃసాగరంలో మునిగిపోయారు.
రోగులతో ఆప్యాయంగా..
నిడదవోలుకు చెందిన ప్రముఖ ఆడిటర్ సురేంద్రకుమార్ కుమారుడైన శ్రీకాంత్ వైద్యవిద్యను అభ్యసించి 2014 నుంచి తాడిమళ్ల పీహెచ్‌సీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. రోగులను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకుంటున్నారు. 2014 నుంచి 2018 వరకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, మెరుగైన వైద్యసేవలు అందించడంతో మూడుసార్లు జిల్లాస్థాయిలో ఉత్తమ అవార్డులు కైవసం చేసుకున్నారు. గత రెండేళ్లుగా సమిశ్రగూడెం పీహెచ్‌సీకీ కూడా అదనపు వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ పాలకవర్గ సమావేశంలో తాడిమళ్ల పీహెచ్‌సీ శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవనానికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులకు శ్రీకాంత్ అందజేశారు. వైద్యపరీక్షలకు వచ్చే పేద గర్భిణీలకు రక్తహీనత ఇబ్బందులు ఉంటే ఆయనే స్వయంగా కొంత నగదును ఇచ్చి పండ్లు, పౌష్టికాహారం తీసుకోమని సూచించేవారని సిబ్బంది చెబుతున్నారు. శ్రీకాంత్‌కు రెండేళ్ల క్రితం వీణ బాలకృష్ణన్‌తో వివాహం కాగా ఆమె కేరళలో దంతవైద్యం(బీడీఎస్) చేస్తున్నారు. మరణవార్త తెలియగానే నిడదవోలు చేరుకున్న భార్య శ్రీకాంత్ మృతదేహం చూసి గుండెలవిసేలా రోదించారు. ఆమె ప్రస్తుతం మూడోనెల గర్భిణీ అని బంధువులు చెబుతున్నారు.
పలువురి సంతాపం
వైద్యాధికారి పి.శ్రీకాంత్ భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మునిసిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎ.ఆంజనేయులు, కమిషనర్ జి.కృష్ణమోహన్, డెప్యూటీ ఎంహెచ్‌ఓ శైలజ, వైద్యులు ఎవీఆర్‌ఎస్ తాతారావు, బి.శ్రీనివాసరావు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులతో పాటు ఆసుపత్రుల సిబ్బంది, రాజకీయ నాయకులు, బంధువులు నివాళులర్పించి ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment