నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ గోపీనాథ్ జట్టి
కర్నూలు/డోన్: డోన్ పట్టణంలో సంచలనం కల్గించిన ప్రైవేట్ డాక్టర్ పోచా శ్రీకాంత్‌రెడ్డి (47) హత్య కేసు మిస్టరీ వీడింది. ఐదు రోజుల వ్యవధిలో డోన్ పోలీసులు కేసును ఛేదించారు. దారుణానికి ఒడిగట్టిన మురారి నరసింహ, భార్య నాగరత్న, కొడుకు మురారి చంద్రశేఖర్‌లను పక్కా సమాచారంతో కర్నూలు శివారులోని హైదరాబాదు జాతీయ రహదారి పంచలింగాల క్రాస్ వద్ద అదుపులోకి తీసుకుని ఎస్పీ గోపీనాథ్ జట్టి ఎదుట హాజరుపరిచారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఓఎస్‌డీ రవిప్రకాష్‌తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలు వెల్లడించారు.
హత్యకు దారి తీసిన కారణాలు
సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో మురారి నరసింహ రెండేళ్ల క్రితం రూ.9 లక్షలు, రూ.8 లక్షల చొప్పున తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో గుర్తు తెలియని మడ్డి సురేష్ పేరుతో పాలసీని సృష్టించి రెండింటికీ ఒక్కొక్క కంతు చొప్పున కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లోని బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్‌లో చెల్లించాడు. పాలసీ బాండ్‌లు వచ్చిన తర్వాత కొంత కాలానికి మడ్డి సురేష్ చనిపోయినట్లు రూ.2 వేలు ఇచ్చి డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిచేత డెత్ రిపోర్టు సృష్టించాడు. దాని ఆధారంగా డోన్ మున్సిపాలిటీలో మరణ ధ్రువీకరణ పత్రం పొంది రెండు పాలసీల ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ మొత్తం రూ.34 లక్షలు కంపెనీ చెల్లించాలని తన భార్య మురారి నాగరత్నంను మడ్డి సురేష్ భార్యగా చూపించి దరఖాస్తు పెట్టించాడు. అయితే మడ్డి సురేష్ ఫొటో స్థానంలో మురారి నరసింహదిగా ఇన్సూరెన్స్ ఇన్‌స్పెక్టర్ విచారణలో కనుగొని కంపెనీకి నివేదించడంతో పాలసీ డబ్బులు నిలిపివేశారు. తాను మడ్డి సురేష్ భార్యనేనని, అతను చనిపోయాడని, తనకు రావలసిన మెచ్యూరిటీ డబ్బు రూ.34 లక్షలను ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించాలని కర్నూలు వినియోగదారుల కోర్టులో ప్రధాన నిందితుడు కేసు వేయించాడు.
పొరపాటున డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లువినియోగదారుల ఫోరంలో డాక్టర్ సాక్ష్యం
నేరస్థుడు మురారి నరసింహకు రెండేళ్ల క్రితం పొరపాటున డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కర్నూలు వినియోగదారుల కోర్టులో డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి సాక్ష్యం చెప్పడంతో 2018 ఏప్రిల్ 16న కేసు వీగిపోయింది. మళ్లీ సివిల్ కోర్టులో అప్పీలు చేసుకుంటే డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని సాక్ష్యానికి రాకుండా చేయాలని నిందితుడు కుటుంబ సభ్యులతో కలసి పథకం వేశాడు. అందులో భాగంగా మురారి నరసింహ, అతని కొడుకు మురారి చంద్రశేఖర్ కలసి ఈనెల 10న సాయంత్రం 5:30 గంటల సమయంలో ఒక పేషంట్‌కు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని నమ్మించి డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని ఆటోలో తీసుకువెళ్లి డోన్ మండలం ఉడుములపాడు ఊరిబయట చెరువు కాలువ వద్ద వెనుక నుంచి రోకలి బండతో తలపై కొట్టి హత్య చేశారు. శవాన్ని కాలువలోకి ఈడ్చుకువెళ్లి ఎవరికీ కనిపించకుండా కంప చెట్ల కింద దాచిపెట్టారు. ముందు గా వెంట తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్‌పై రక్తపు మరకలు ఉన్నందున కొత్త క్యాన్ కోసం శవాన్ని అక్కడే విడిచిపెట్టి రోడ్డుపైకి రాగా, హైవే పెట్రోల్ వాహనం కనిపించడంతో తమ కోసమే గాలిస్తున్నారేమో అనుకుని అక్కడి నుంచి పారిపోయారు.
బయటపడింది ఇలా..
ఆటోలో వెళ్లిన డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అంతటా గాలించినా శ్రీకాంత్‌రెడ్డి కనిపించలేదు. మరునాడు ఉదయం ఘటన వెలుగు చూడటంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి శ్రీకాంత్‌రెడ్డిగా గుర్తించారు. ఈయన నంద్యాల మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డి మనవడు. మృతుని భార్య ఉదయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఓఎస్‌డీ రవిప్రకాష్ స్పెషల్ ఆఫీసర్‌గా డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్ నేపథ్యంలో ఐదు పోలీసు బృందాలు గాలించి ఐదు రోజుల వ్యవధిలో కేసు మిస్టరీని ఛేదించారు. నిందితులను త్వరగా అరెస్టు చేసినందుకు ఓఎస్‌డీ రవిప్రకాష్, డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీఐ రాజగోపాల్ నాయుడు, టౌన్ ఎస్‌ఐ శ్రీనివాసులు, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేయడంలో దిట్ట
మురారి నరసింహ పలు ఇన్సూరెన్స్ కంపెనీలను మోసగిస్తూ పబ్బం గడుపుకునేవాడని వెల్లడైంది. బినామి పేర్లపై పాలసీలు ప్రారంభించాలని ఆయన తరచూ ఎల్‌ఐసీతో పాటు ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లపై ఒత్తిడి తెస్తుండేవాడని తెలిసింది. ఈ క్రమంలో తన సొంత అత్త నర్సమ్మ బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి రూ.8లక్షల ఇన్సూరెన్స్ మొత్తాన్ని కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే వృత్తిగా పెట్టుకున్న నరసింహ ఎప్పుడో చనిపోయిన మడ్డి సురేష్ పేరుపై బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీకి కంతులు చెల్లించారు. డాక్టర్ శ్రీకాంత్ హత్యకు ఒక రోజు ముందు కూడా పోస్టాఫీస్ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లి తన కుమారుడి పేరు మీదున్న రూ.17వేలను నరసింహ విత్‌డ్రా చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment