బైకు మీద చెయ్యేశాడని... | Eight Members Attack On Man Infront Of Bar | Sakshi
Sakshi News home page

బైకు మీద చెయ్యేశాడని...

Published Wed, Mar 28 2018 7:32 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Eight Members Attack On Man Infront Of Bar - Sakshi

గుంటూరు ,మంగళగిరిటౌన్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సలామ్‌హోటల్‌ సెంటర్‌లో ఓ బార్‌ ముందు పార్క్‌ చేసి ఉన్న వాహనం మీద చేయి వేశాడని 8 మంది వ్యక్తులు ఓ వ్యక్తిపై బ్లేడ్లు, కత్తులతో దాడిచేసి గాయపరిచిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లి సలామ్‌ హోటల్‌ సెంటర్‌కు చెందిన వేముల రమణబాబు కూలి పనులు చేస్తూ జీవిస్తుంటాడు. తనకు రావలసిన కూలీ డబ్బుల కోసం మేస్త్రీ నులకపేట సమీపంలోని ఓ బార్‌లో ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్లాడు. బయట నిలబడి పార్కింగ్‌ చేసిన ఓ వాహనం మీద చేయి వేసి నిలబడ్డాడు. బార్‌లో నుంచి వెల్లంకి సందీప్, మరో ఏడుగురు కలిసి బయటకు వచ్చి ఏంట్రా బండి మీద చెయ్యేశావని రమణబాబుపై దాడిచేశారు.

బ్లేడ్లతో ఇష్టం వచ్చినట్టు శరీరం మీద కోసేశారు. భయపడిన రమణబాబు వెంటనే తన అన్న వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేశాడు. అక్కడకు వచ్చిన వెంకటేశ్వర్లుపై కూడా కత్తితో దాడిచేసి అరచేతిపై గాయపరిచారు. అతని దగ్గరున్న 15వేల రూపాయలను కాజేశారు. అనంతరం దాడిచేసిన వారిలో ప్రధాన వ్యక్తి సందీప్‌పై రన్నింగ్‌రూమ్‌ సెంటర్‌ నుంచి వెళ్లిన కొందరు యువకులు దాడిచేసి గాయపరిచారు. తాడేపల్లి ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్‌ సందీప్‌ మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులోని మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకోవాలని పెద్ద సంఖ్యలో స్థానికులు మంగళవారం ఉదయం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. మధ్యాహ్నానికి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతావారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement