పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో బాధితులు
పంజగుట్ట: తక్కువ ధరకే ఫ్లాట్స్.. హాలిడే ట్రిప్స్ తీసుకెళతామంటూ ప్రచారం చేసుకుని పలువురి నుంచి నగదు వసూలు చేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన షేక్ ఖాధర్ బాషా, పానగంటి విజయ్ కుమార్, అనూజ్ పటేల్ కలిసి వెంకటరమణ కాలనీలో ఎలైట్ రియాలిటీ సర్వీసెస్ సంస్థను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. తక్కువ ధరకే యాదగిరిగుట్ట సమీపంలో ఫ్లాట్స్ ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. సెలవుదినాల్లో దేశ, విదేశాల్లో హాలిడే ట్రిప్స్‌కు తీసుకువెళతామని నమ్మించి ఒకొక్కరి నుంచి అడ్వాన్స్‌గా రూ.లక్ష నుండి రూ.2 లక్షల వరకు వసూలు చేశారు. చెల్లించిన డబ్బులకు బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చారు.
వీరి మాటలు నమ్మిన 30 మంది రూ.40 లక్షలకు పైగా మోసపోయినట్లు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సదరు సంస్థ కార్యాలయానికి వెళ్లగా అప్పటికే బోర్డు తిప్పేసి పారిపోయారు. నిందితులు ప్రయారిటీ సర్వీసెస్, ల్యాండ్ మార్క్ ఇన్‌ఫ్రా, ఫారŠూచ్యన్ గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్ పేరుతో పలు సంస్థలను స్థాపించి చాలా మందిని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని ఎస్సై సతీష్ తెలిపారు. కాగా నిందితులు ముంబైలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment