జంట హత్యల కేసులో.. మాజీ ఎమ్మెల్యే వ్యూహకర్త | Ex Odisha MLA Arrested On Murder Charge | Sakshi
Sakshi News home page

జంట హత్యల కేసులో.. మాజీ ఎమ్మెల్యే వ్యూహకర్త

Published Sun, Feb 16 2020 3:22 PM | Last Updated on Sun, Feb 16 2020 3:25 PM

Ex Odisha MLA Arrested On Murder Charge - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో వెలుగు చూసిన జంట హత్యల కేసులో అధికార పక్షం బిజూ జనతాదళ్‌ నాయకుడు, శాసన సభ మాజీ సభ్యుడు అనుప్‌ కుమార్‌ సాయి వ్యూహాత్మక హంతకుడిగా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు పేర్కొన్నారు.  ఆయనను రాయఘర్‌ కారాగారానికి తరలించారు. కల్పన దాస్‌ (32), ఆమె కుమార్తె ప్రభాతి దాస్‌ (14)లను  పకడ్బందీ వ్యూహంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆధారాలతో నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. బెయిల్‌ మంజూరు చేసేందుకు రాయిఘర్‌ కోర్టు నిరాకరించింది. నిందితుడి ఆచూకీ గుర్తింపు, సాక్షాధారాల సేకరణ వగైరా అనుబంధ కార్యాచరణలో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అహర్నిశలు శ్రమించినట్లు రాయిఘర్‌ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ సంతోష్‌ కుమార్‌ సింగ్‌ విలేకరులకు వివరించారు.

తొలి భర్తతో విడాకులు పొందిన కల్పన దాస్‌ నిందితుడు అనుప్‌ కుమార్‌ సాయితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. క్రమంగా వైవాహిక బంధంగా మలుచుకునేందుకు ఆమె విఫలయత్నం చేసింది. వివాహానికి అంగీకరించని నిందితుడు అనుప్‌ కుమార్‌ ఆమె అడ్డు తొలగించుకునేందుకు వ్యూహ రచన ప్రారంభించాడు. వ్యూహం ప్రకారం తన డ్రైవర్‌ బర్మన్‌ టొప్పొ సహకారంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు హమీర్‌పూర్‌ అటవీ ప్రాంతంలో తల్లీకూతుళ్లను హతమార్చాడు. బలమైన ఇనుప కడ్డీతో తల్లీకూతుళ్లను చావగొట్టి హత్య చేశారు. అనంతరం కారుతో మృతదేహాల్ని తొక్కించి దుర్ఘటనగా చిత్రీకరించి మృతదేహాల్ని పాతిబెట్టినట్లు ఎస్పీ వివరించారు.  2016వ సంవత్సరం నుంచి  నిందితుల ఆచూకీ కోసం ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో 700 మందిని పోలీసులు  ప్రశ్నించారు.

మొదటి భర్త సునీల్‌ శ్రీవాస్తవ్‌తో విడాకులు తీసుకున్న కల్పనా దాస్, బీజేడీ నాయకుడు అనుప్‌ సాయితో కాపురం కొనసాగించారు. 2011వ సంవత్సరం నుంచి 2016వ సంవత్సరం వరకు భువనేశ్వర్‌లో మూడంతస్తుల భవనంలో కలిసి జీవించారు. క్రమంగా పెళ్లి చేసుకోవాలని కల్పన ఒత్తిడి తేవడంతో ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతం దేవాలయంలో వివాహం చేసుకుంటానని అనుప్‌ కుమార్‌ నమ్మించి తల్లీబిడ్డలతో బయలుదేరి అటవీ ప్రాంతంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్‌పీ వివరించారు.   చదవండి: క్షమాపణ కోరడం, కాళ్లు పట్టుకోవడం జరగదు: చిన్మయి

డ్రైవర్‌ అరెస్టు
మాజీ ఎంఎల్‌ఏ అనుప్‌ కుమార్‌ సాయి డ్రైవర్‌ బర్దన్‌ టొప్పొను పోలీసులు శనివారం రాత్రి ఆయన నివాసంలో అరెస్టు చేశారు. దాదాపు 18 గంటల నిరవధిక విచారణలో నిందిత మాజీ ఎంఎల్‌ఏ  అనుప్‌ కుమార్‌ సాయి తన డ్రైవర్‌కు సంబంధించిన సమాచారం బహిరంగపరిచారు. ఈ సమాచారం ఆధారంగా డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు రాయఘర్‌ ఎస్‌పీ సంతోష్‌ సింగ్‌ తెలిపారు. కల్పన దాస్, ఆమె కుమార్తె ప్రభాతి దాస్‌ను హత్య చేయడంలో మాజీ ఎంఎల్‌ఏ అనుప్‌ కుమార్‌కు డ్రైవర్‌ బర్దన్‌ టొప్పొ పూర్తి సహకారం అందజేశాడని ఎస్‌పీ వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement