‘నకిలీ’ల ముఠా గుట్టు రట్టు | Fake Documets Gang Arrest In Krishna | Sakshi
Sakshi News home page

‘నకిలీ’ల ముఠా గుట్టు రట్టు

Published Wed, May 23 2018 2:21 PM | Last Updated on Wed, May 23 2018 2:21 PM

Fake Documets Gang Arrest In Krishna - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న నూజివీడు, నందిగామ డీఎస్పీలు శ్రీనివాసరావు, మురళీ

కంచికచర్ల (నందిగామ) : కాసుల కోసం కక్కుర్తిపడి నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించి పలువురికి భూములు, స్థలాలు అమ్మి కోట్లాది రూపాయలను దండుకున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో పోలీసుల పాత్రపై కూడా విచారణ జరపాలని నిర్ణయించుకోవటం విశేషం. నకిలీ భూముల కుంభకోణంపై కంచికచర్ల పోలీస్‌ అధికారుల పాత్రలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు అధికారిగా నూజివీడు డీఎస్పీ ఏ శ్రీనివాసరావును నియమించారు. ఈ కుంభకోణంపై మంగళవారం కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌లో నందిగామ డీఎస్పీ టీఆర్‌ మురళీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నూజివీడు డీఎస్పీ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మధిరకు చెందిన శీలం కోటిరెడ్డి నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించాడని ఫిర్యాదులు అందాయని తెలిపారు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే కోటిరెడ్డి రిజిస్ట్రేషన్‌ చేసి భూమి అప్పగించలేదని పెనమలూరుకు చెందిన కంచర్ల శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశాడని తెలిపారు. 2015లో సర్వే నెంబర్‌ 55/6బీలో 15 సెంట్ల స్థలాన్ని రూ.8 లక్షలకు అమ్మాడని, విజయవాడలో రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశాడని తెలిపారు. అలాగే, కపిలవాయి కృష్ణవేణి, శీలం పిచ్చిరెడ్డి, వెన్నం రాజ్యలక్ష్మి, వెన్నం వెంకటకృష్ణారెడ్డి ముఠాగా ఏర్పడి ఇతరులకు చెందిన స్థలాలు, భూములను తమవని నమ్మించి అమాయకులకు అమ్ముతున్నారని వెల్లడించారు. వీరు పలు స్థలాలను కంచర్ల శ్రీనివాసరావుకు తనఖా రిజిస్ట్రేషన్‌ చేసి అతని నుంచి దఫదఫాలుగా రూ.26 లక్షల వరకు తీసుకున్నారని తెలిపారు. గడువు తీరినా సొమ్ము చెల్లించకపోగా ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాకపోవటంతో డాక్యుమెంట్లను పరిశీలించగా ఆ భూములు వారివి కావని తెలుసుకుని స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని వివరించారు. కోటిరెడ్డితో పాటు ఏ2గా ఉన్న కృష్ణవేణిలపై కేసు నమోదు చేశామని ఇంకా విచారణ చేపట్టి ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

సివిల్‌ కేసులో పోలీసుల జోక్యం..
సివిల్‌ కేసులో పోలీసులు జోక్యం చేసుకోకూడదని నందిగామ డీఎస్పీ తాళ్లూరి రాధేష్‌మురళీ స్పష్టం చేశారు. అయితే, కోటిరెడ్డి – శ్రీనివాసరావుల మధ్య నందిగామ రూరల్‌ సీఐ ఒప్పంద పత్రాన్ని రాయించాడని చెప్పారు. ఆ ఒప్పందం ప్రకారం గడువు ముగిసినా శ్రీనివాసరావుకు కోటిరెడ్డితో రిజిస్ట్రేషన్‌ చేయించలేదని తెలిపారు. దీనిపైనా పూర్తిస్థాయిలో విచారణ జరిపి సీఐపై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement