మహేశ్, కూతురు దర్శిని(ఫైల్)
రైల్వేగేట్(వరంగల్): కుటుంబ కలహాలతో రైలు కింద పడి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వరంగల్ జీఆర్‌పీ సీఐ జూపల్లి వెంకటరత్నం కథనం ప్రకారం... కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన కొంగ మహేశ్(33) కొంతకాలం వరంగల్‌లో నివసించాడు. రెండేళ్లుగా సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొండపాడులో రేఖ కెమికల్ ఫ్యాక్టరీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
తన తల్లి పూలమ్మ(60), కూతురు దర్శిని(13), భార్య సంగీత, కుమారుడు కార్తికేయతో కలసి బుధవారం ఖమ్మంలో నాగర్‌సోల్ రైలు ఎక్కి సాయంత్రానికి వరంగల్ చేరుకున్నారు. సంగీత కార్తికేయతో కలసి కాజీపేటలో తల్లిగారింటికి వెళ్లింది. మహేశ్, పూలమ్మ, దర్శిని మాత్రం కాశిబుగ్గలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి అర్ధరాత్రి వరంగల్ జాన్‌పీరిల సమీపంలోని రైల్వేట్రాక్ వద్దకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాన్ని సరిగా చూసుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మహేశ్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల వల్లే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి నట్లు సీఐ తెలిపారు. సంగీత మాత్రం తమ మధ్య ఎలాంటి గొడవల్లేవని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదని రోదించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment