బాలానగర్: బ్యాంకు అధికారుల ఒత్తిడితోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ రైతు రాసిన సూసైడ్ నోట్ ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దరేవళ్లికి చెందిన జహంగీర్ డిసెంబరు 22న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో సాధారణ మృతిగానే భావించినా.. ఆయన రాసిన లేఖ బయటపడటంతో కలకలం సృష్టించింది. జహంగీర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి లక్ష్మారెడ్డికి రాసిన లేఖలో తాను ఆత్మహత్య చేసుకునేందుకు దారి తీసిన కారణాలను వివరించాడు.
తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడు. యాదిరాల బ్యాంకులో రూ.3 లక్షల అప్పు తీసుకుని రెండు బోర్లు వేశానని, కొంత కాలం తర్వాత రెండూ ఎండిపోయాయని పేర్కొన్నాడు. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎంత కష్టపడినా బ్యాంకు అప్పు తీరలేదని, బ్యాంకు అధికారులు మహబూబ్‌నగర్ కోర్టులో కేసు వేసి కోర్టు చుట్టూ తిప్పారన్నారు.
తన కుమారుడు ఎమ్మెస్సీ, బీఈడీ చదివినా నౌకరీ రాలేదని వాపోయాడు. ప్రస్తుతం అప్పు రూ.12 లక్షలకు చేరిందని, భూమిని జప్తు చేస్తామని కోర్టు వారు అంటున్నారని పేర్కొన్నాడు. ‘‘మీరు ఆపద్బాంధవుడు.. తన కుటుంబ సభ్యులను ఆదరించడంతో పాటు కుమారుడు రవీందర్‌ను నౌకరీ ఇప్పించాలని ముఖ్యమంత్రిని ఆ లేఖలో ప్రాథేయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment