
సాక్షి, ఢిల్లీ : బంధాలు బంధుత్వాలు మంట కలిసిపోతున్నాయి. ఓ కిరాతకపు తండ్రి కన్న కూతురు మరో యువకునితో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో 13 ఏళ్ల కూతురిని గొంతుకోసి చంపేశాడు. ఈ దారుణం ఢిల్లీలోని కరవాల్ నగర్‌లో చోటుచేసుకుంది. డీసీపీ ఏకే సింగ్లా తెలిపిన వివరాల ప్రకారం.. కరవాల్ నగర్‌కు చెందిన సుదేశ్ కుమార్ అనే వ్యక్తి కూతురు ఇంటి పక్కనే ఉన్న ఓ యువకునితో స్నేహంగా ఉండటంతో చాలా సార్లు వారిద్దరిని హెచ్చరించాడు. అయినా వారు వినకుండా తరచూ కలుసుకుని మాట్లాడుకోవడం చూసి కుమార్ సహించలేకపోయాడు.
అయితే ఈ నెల 7న సుదేశ్ కూతురుని తమ నివాసానికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రొనికా నగర శివారుకి బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడ ఓ డ్రైనేజీ కాలువ వద్దకు తనను తీసుకెళ్లి గొంతుకోసి అందులో పడేశాడు. ఆపై కుటుంబ సభ్యులతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ కూతురు కన్పించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఐపీసీ 363 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నారు.
విచారణ చేపట్టిన పోలీసులకు మురికి కాలువలో మృతదేహం ఉందనే సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ పుటేజీని పరిశీలించగా అందులో ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై మురికి కాలువ వైపు పోవటాన్ని గమనించారు. అందులో ఉన్న వ్యక్తి సుదేశ్ కుమార్‌లా ఉండటంతో అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయట పడింది. మరొకరితో సన్నిహితంగా ఉంటుదన్న కారణంతో తనను హత్య చేసినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.