మృతి చెందిన మోగేశ్వరి, కుసుమిత
సాక్షి, చిత్తూరు : చిత్తూరులోని బంగారెడ్డిపల్లి చెరువు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి బంగారెడ్డిపల్లె సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు నగరం గిరింపేటలోని ఓటి చెరువుకు చెందిన చంద్రశేఖర్ అలియాస్ చలపతి రెడ్డికి ఇద్దరు కుమార్తెలు యోగేశ్వరి(15), కుసుమిత(5) ఉన్నారు. కుటుంబ కలహాలతో జీవితం మీద విరక్తి చెందిన చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.
శుక్రవారం రాత్రి చిత్తూరు రూరల్ మండలంలోని బంగారెడ్డిపల్లె సమీపంలో ఇద్దరు కూతుళ్లతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఆ ముగ్గురిని ఆపస్మారక స్థితిలో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యోగేశ్వరి, కుసుమతి మృతి చెందినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. తండ్రి చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న ఎన్‌ఆర్‌పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment