సాక్షి, అమరావతి బ్యూరో: వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి సూత్రధారిగా, ఆమె ప్రియుడు రాకేష్‌రెడ్డి హంతకుడిగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆర్థిక పరమైన లావాదేవీల్లో విభేదాలే ఈ హత్యకు కారణమని తేలింది. గత నెల 31న దస్పల్లా హోటల్ వద్ద నుంచి జయరామ్‌ను కారులో తీసుకొచ్చిన రాకేష్.. మరికొందరితో కలిసి అతనికి జబ్బుతో ఉన్న కుక్కలకు ఇచ్చే ఇంజెక్షన్ చేసి హైదరాబాద్‌లోనే హత్య చేసినట్లు సమాచారం. ఆ తర్వాత కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే యత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. జగ్గయ్యపేటలోని రాంకో సిమెంట్ కంపెనీకి చెందిన గెస్ట్‌హౌస్‌లో జిల్లా ఎస్పీ ఎస్.త్రిపాఠి.. రాకేష్‌ని, శిఖా చౌదరిని వేర్వేరుగా విచారించారు. హత్య కేసులో వారిద్దరి పాత్రపై ఒక స్పష్టతకు వచ్చిన పోలీసులు.. వారికి సహకరించిందెవరు? హత్యకు గల కారణాలు మరేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక లావాదేవీలు.. పెళ్లికి అడ్డుగా నిలిచాడనే హత్య?
రాకేష్‌రెడ్డి, శిఖా చౌదరి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. శిఖా అడిగిన మేరకే రాకేష్ జయరామ్‌కు రూ. 4.5 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు సమాచారం. అయితే డబ్బు తిరిగి చెల్లించే విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అదేసందర్భంలో రాకేష్‌రెడ్డితో పెళ్లికి మామయ్య జయరామ్ అడ్డుపడ్డారని, అలాగే జయరామ్ తన విల్లాకు తరచూ రావడం రాకేష్‌కు ఇష్టం లేదని శిఖా పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అదేసమయంలో టెక్ట్రాన్ అనే కంపెనీ లావాదేవీల విషయంలో శిఖాకు, జయరామ్‌కు మధ్య విభేదాలు వచ్చాయని, మామయ్యకు తెలియకుండా కంపెనీ చెక్కులపై శిఖా ఫోర్జరీ సంతకాలు కూడా చేసినట్లు వెల్లడయింది. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల టర్నోవర్ జరిగినట్లు సమాచారం. ఈ విషయం జయరామ్‌కు తెలియడంతో వారిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. జయరామ్ స్థాపించిన అనేక కంపెనీలను శిఖా చౌదరినే నిర్వహిస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం మంగొల్లు సమీపంలో 10 ఎకరాల ఫాం హౌస్‌ను శిఖా పేరిట జయరామ్ రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను జయరామ్ తన వద్దే ఉంచుకున్నారు. వాటిని చేజిక్కించుకోవడం కోసం ఇటీవల ఓ యువతిని సైతం జయరామ్‌కు ఎరగా వేసినట్లు తెలుస్తోంది. అయినా డాక్యుమెంట్లు లభించకపోవడం, తమ పెళ్లికి అడ్డుగా ఉండటం, అప్పు విషయంలో విభేదాల కారణంతో బాయ్‌ఫ్రెండ్ రాకేష్‌రెడ్డితో కలిసి హత్యకు పథక రచన చేసినట్లు పోలీసుల విచారణలో శిఖా అంగీకరించినట్లు సమాచారం. బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితులు మరికొందరితో కలసి గత నెల 31న జయరామ్‌ను దస్పల్లా హోటల్ నుంచి కారులో తీసుకొచ్చి హైదరాబాద్ శివార్లలో ఇంజెక్షన్ చేసి జయరామ్‌ను హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసు వివరాలను కృష్ణా జిల్లా పోలీసులు సోమవారం మీడియాకు వెల్ల డించే అవకాశం ఉంది.
అత్యంత రహస్యంగా విచారణ..వీఆర్‌కు కానిస్టేబుల్
హత్య కేసులో అనుమానితులను కృష్ణా జిల్లా పోలీసులు అత్యంత రహస్యంగా విచారిస్తున్నారు. దర్యాప్తు సందర్భంగా పోలీసు బృందాలకు లభ్యమైన కీలక ఆధారాలు, అలాగే తమ అదుపులోకి తీసుకున్న అనుమానితుల వివరాలు కానీ ఎక్కడా వెల్లడించకుండా ఎస్పీ త్రిపాఠి జాగ్రత్తలు తీసుకున్నారు. శిఖా చౌదరిని పోలీసులు విచారిస్తున్న ఫొటో ఆదివారం ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఎస్పీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫొటో మీడియాకు ఇచ్చారన్న కారణంతో ఓ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపించారు.అలాగే మరో ఐదుగురు కానిస్టేబుళ్ల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ కేసు విషయంలో ఎస్పీ ఎందుకంత గోప్యత పాటిస్తున్నారనే అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ సీఎం ఆఫీసులో రాకేష్ హవా!
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. సీఎం కార్యాలయంలో పనిచేసే అభిష్టా అనే వ్యక్తితో రాకేష్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అభిష్టా సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ క్లాస్‌మేట్ కావడం వల్లే అతడిని సీఎంవోలో ఓఎస్‌డీగా నియమించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాకేష్‌రెడ్డి కూడా ఇటు చంద్రబాబుతో అటు నారా లోకేష్‌తో సత్సంబంధాలు నెరిపినట్లు సీఎంవో వర్గాలు పేర్కొంటున్నాయి. రాకేష్ ఫోన్ కాల్‌తో ఎవరికైనా తిరుమలలో ఎల్–1 దర్శనం లభిస్తుందంటే అతడి పలుకుబడి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ కారణంతోనే హైదరాబాద్‌లోనే జయరామ్‌ను హత్య చేసినప్పటికీ కృష్ణా జిల్లాకు తీసుకువచ్చి ఐతవరం సమీపంలో ఓ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదు అయితే తనకు ఉన్న పలుకుబడితో బయటపడొచ్చనే ధీమాతోనే ఇలా చేశాడని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
శిఖాకు ఏ పాపం తెలియదు
కబాలి సినీ నిర్మాత కేపీ చౌదరి
కంచికచర్ల(నందిగామ): జయరామ్ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఏ మాత్రం లేదని కబాలి సినీ నిర్మాత కేపీ చౌదరి చెప్పారు. ఆదివారం కంచికచర్ల వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ఆమెకు ఈ పాపంలో ఎలాంటి ప్రమేయం లేదన్నారు. జయరామ్ అంటే శిఖాకు ప్రాణం అని, ఆయన ఆస్తి విషయాలన్నీ శిఖాయే చూసుకుంటుందని చెప్పారు. జయరామ్‌కు బిజినెస్‌లలో పూర్తి సహకారం ఇచ్చేదని తెలిపారు.
పోలీసులపై అధికారపార్టీ ఒత్తిళ్లు..
జయరామ్ కేసులో నిందితులైన వారిద్దరినీ తప్పించేందుకు టీడీపీకి చెందిన ముఖ్యనేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జయరామ్ కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులకు అందులో గుంటూరుకు చెందిన టీడీపీ ఎంపీ సోదరుడి కుమారుడి ఫోన్ నంబర్ ఉండటం..అతడికి శిఖా చౌదరికి మధ్య మద్యం వ్యాపారానికి సంబంధించిన అంశంలో భాగస్వామ్యం ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఈ కేసు నుంచి తప్పించేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వారి ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికే ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హత్య హైదరాబాద్‌లో జరిగింది కాబట్టి ఆ ప్రాంత పోలీసుస్టేషన్‌కు నిందితులతోపాటు కేసును బదలాయించాలని పోలీసులు చూస్తున్నట్లు తెలిసింది.
జయరామ్ అంత్యక్రియలు పూర్తి
సాక్షి, హైదరాబాద్: హత్యకు గురైన కోస్టల్ బ్యాంకు డైరక్టర్, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ముగిశాయి. అమెరికాలో ఉంటున్న జయరామ్ భార్య పద్మశ్రీ, కుమార్తె, కుమారుడు సాయి శ్రీరాం శనివారం అర్ధరాత్రి 2 గంటలకు అమెరికా నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 44లో ఉన్న భర్త ఇంటికి చేరుకున్నారు. అనంతరం బసవ తారకం కేన్సర్ ఆస్పత్రిలో భద్రపరిచిన జయరామ్ శవపేటికను ఇంటికి తరలించారు. సన్నిహితులు, మిత్రుల నివాళి అనంతరం జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు శ్రీరాం తండ్రి చితికి నిప్పటించారు. కాగా, జయరామ్ బొంతపల్లిలో ఏర్పాటు చేసిన టెక్ట్రాన్ పోలి లెన్సెస్ పరిశ్రమలో 2015 నుంచి తమకు జీతాలు ఇవ్వకుండా సీఈవోగా పనిచేసిన శిఖా చౌదరి అడ్డుకున్నారని సంస్థ ఉద్యోగులు ఆరోపించారు. జయరామ్‌కు నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి వచ్చిన సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ శిఖా వచ్చాకే సంస్థ మూతపడిందన్నారు. ఆమె తీరు వల్ల 150 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment