పాక్షికంగా కాలిన తలుపు
పొన్నలూరు: స్థానిక ఆంధ్రాబ్యాంకుకు ఆకతాయి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. శని, ఆదివారం బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో అధికారులు తాళాలు వేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌తో వచ్చి బ్యాంకు ఆవరణలో ఉన్న చెత్తకు నిప్పు పెట్టాడు. అంతేకాకుండా బ్యాంకు తలుపులపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సమయం తర్వాత చెత్త పూర్తిగా దగ్ధమై పెద్దగా మంటలు వచ్చాయి. బ్యాంకు తలుపులు కూడా పాక్షికంగా తగలబడ్డాయి. ఇంతలో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి మంటలు పెద్దవి కాకముందే నీరు పోసి ఆర్పేశారు.
పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే బ్యాంకు లోపలి భాగంలో మంటలు అంటుకోని ఉంటే భారీగా నష్టం జరిగేది. ఈ పని కావాలనే చేశారా, లేకుంటే ఎవరైనా ఆకతాయిలు చేశారనేది తేలాల్సి ఉంది. బ్యాంకు ఆవరణంలోకి ఎవరు వచ్చారనేది సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించే అవకాశం ఉంది. ఈ సంఘటనపై పోలీసులను ప్రశ్నించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ కె. సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment