ప్రమాద దృశ్యం (ఇన్‌సెట్) శ్రీకాంత్ మృతదేహం
కారేపల్లి : ఓ డ్రైవర్ నిద్ర మత్తు.. ప్రమాదానికి కారణమైంది. అతడి ప్రాణాన్ని బలి తీసుకుంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన బూర శ్రీకాంత్(38), హుజూర్ నగర్‌లోని కోదండరామ్ ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎన్‌టీపీసీ నుంచి ఫ్లైయాష్ ట్యాంకర్‌ను నల్లగొండ జిల్లాలోని మట్టంపల్లి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి తీసుకెళుతున్నాడు. కొత్తగూడెం నుంచి ఇల్లెందు మీదుగా ఖమ్మం ప్రధాన రహదారి వైపు వస్తున్నాడు. అప్పటికే అర్థరాత్రి కావటంతో ఇల్లెందు వరకు వచ్చి, ట్యాంకర్‌ను రోడ్డు పక్కన ఆపాడు. కునుకు తీస్తున్నాడు.
శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో, మరో ఫ్లైయాష్ ట్యాంకర్ అదే మార్గంలో వచ్చి, మొదటి ట్యాంకర్ ఉన్నచోట ఆగింది. దాని డ్రైవర్ కిందకు దిగి, నిద్రపోతున్న శ్రీకాంత్‌ను లేపి, త్వరగా వెళదామంటూ తొందరపెట్టాడు. అప్పటికి శ్రీకాంత్‌ను నిద్ర మత్తు పూర్తిగా వదల్లేదు. అతడు ట్యాంకర్‌ను స్టార్ట్ చేశాడు. ఇల్లందు–ఖమ్మం ప్రధాన రహదారి వైపు వస్తుండగా, కారేపల్లి మండలం కొమ్ముగూడెం సమీపంలో ఆ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న లోయలోకి దూసుకెళ్లి బోలాపడింది. డ్రైవర్ శ్రీకాంత్‌పై ట్యాంకర్ బాడీ (క్యాబిన్) పడిపోయింది. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని కారేపల్లి ఎస్‌ఐ కిరణ్‌కుమార్ పరిశీలించారు. ట్యాంకర్ క్యాబిన్‌లో ఇరుక్కున్న మృతదేహాన్ని బయటకి తీయించారు.
Comments
Please login to add a commentAdd a comment