
బుక్కపట్నం : ఇనుప రేకు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. గాలికి ఎగిరి వచ్చిన ఆ రేకు నేరుగా ద్విచక్ర వాహనదారుడి శిరస్సును ఖండించింది. అంతే.. క్షణాల్లో తల, మొండెం వేరుపడ్డాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చెన్నేకొత్తపల్లి మండలం మొగలాయిపల్లికి చెందిన రైతు నారాయణరెడ్డి (50) బుధవారం పని నిమిత్తం బుక్కపట్నం వచ్చాడు. తిరుగు ప్రయాణంలో చెరువుకట్ట మీదుగా ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు.
ఇదే సమయంలో కొత్తచెరువు నుంచి బుక్కపట్నానికి ఇనుప రేకును టాపుపై వేసుకుని ఆటో వస్తోంది. నడిమిగుట్ట మలుపు వద్దకు రాగానే టాపుపై ఉన్న రేకు ముందుకు దూసుకొచ్చి.. ఎదురుగా వస్తున్న నారాయణరెడ్డి మెడను తాకింది. క్షణాల్లో రక్తం చిమ్ముతూ మెడ తెగిపడింది. అటుగా వస్తున్న కొందరు ఇది గమనించి దగ్గరకొచ్చి చూసేసరికి నారాయణరెడ్డి అప్పటికే ప్రాణం విడిచాడు. ఆటో టాపుపై రేకును కట్టకపోవడంవల్లే ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment