తీర్పు సందర్భంగా ఆశారాం ఆశ్రమం, జోధ్‌పూర్ జైలు వద్ద కనిపించిన దృశ్యాలు
జోధ్‌పూర్: తాము నమ్మిన భగవత్‌స్వరూపం కడిగిన ముత్యంలా తిరిగొస్తుందని ఆశగా ఎదరుచూసిన భక్తులు కంగుతిన్నారు. బాలికపై అత్యాచారం కేసులో ప్రముఖ ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపు దోషిగా తేలడంతో ఆయన అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ గురువు నిర్దోషిగా విడుదలవుతారని దండలు కూడా తీసుకొచ్చిన అభిమానులు కోర్టు తీర్పుతో షాక్‌కు గురయ్యారు. ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం కనిపించిన దృశ్యాలివి!
ఆథ్యాత్మిక గురువుగా ఒక వెలుగు వెలిగిన ఆశారాం.. దేశవ్యాప్తంగా 400కుపైగా ఆశ్రమాలు స్థాపించారు. 2013లో సహారన్‌పూర్‌లోని తన ఆశ్రమంలోనే ఆయన మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదయింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆశారాం దోషే అంటూ జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మాత్రం నిర్దోషులుగా బయటపడ్డారు. బాపూజీ నిర్దోషిగా బయటికొస్తారని దండలతో వచ్చి జోధ్‌పూర్ జైలు వద్ద హడావిడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీర్పు నేపథ్యంలో ఆశారాం అనుచరులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలున్న దరిమిలా రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని కీలక పట్టణాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
న్యాయం దక్కింది: బాధితురాలి తండ్రి
‘‘ఆశారాం దోషిగా తేలడంతో మాకు న్యాయం దక్కింది. ఈ కేసులో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సాక్షుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలని కోరుతున్నాను. దోషికి కఠిన శిక్ష పడుతుందని భావిస్తున్నా. సుదీర్ఘంగా సాగిన న్యాయ పోరాటంలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’
తీర్పుపై అప్పీలు!
అత్యాచారం కేసులో ఆశారాంను దోషిగా తేల్చిన జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ఆశారాం ఆశ్రమ అధికార ప్రతినిధి నీలమ్ దుబే మీడియాకు చెప్పారు. తీర్పు కాపీని క్షుణ్నంగా చదివి, నిపుణులతో చర్చించిన మీదట తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.
దొంగ బాబాలకు చెంపపెట్టు: కాంగ్రెస్
‘నిజమైన సాధువులకు, దొంగ బాబాలకు మధ్య తేడాలను ప్రజలు పసిగట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తీర్పు ఖచ్చితంగా చాలా మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా బాబాలు, సాధువుల పట్ల అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయాల్లో మార్పు వస్తుంది’’ అని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment