కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ ఎదుట బాధితులు , మల్లిఖార్జున్ , కరక్కాయలు
కేపీహెచ్‌బీకాలనీ: కరక్కాయల పొడిని కొనుగోలు చేస్తామంటూ ఓ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ అమాయక ప్రజలకు వలవేసి కోట్లల్లో వసూలు చేసి ఉడాయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం కేపీహెచ్‌బీ సీఐ కుషాల్కర్ వివరాలు వెల్లడించారు. కేపీహెచ్‌బీకాలనీ రోడ్డునెంబర్ 1లోని ఎంఐజి 1–165లో సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ వెలిసింది. ఆయుర్వేద మందుల తయారీకిగాను కరక్కాయ పొడిని కొనుగోలు చేస్తున్నట్లు, ఇంటివద్ద ఉండే మహిళలు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకోవచ్చునని పలు టీవీ చానళ్లలో 6309390734 ఫోన్ నంబర్‌తో సహా ప్రకటనలు ఇచ్చారు. దీంతో పలువురు సదరు నంబర్‌ను సంప్రదించగా కరక్కాయలను తామే అందిస్తామని కిలో కరక్కాయలకు రూ. వెయ్యి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, పొడిగా మార్చి తీసుకువస్తే అదనంగా రూ.300 లాభం కలిపి మొత్తం 1300 ఇస్తామని తెలిపారు.
పొడి రూపంలో తీసుకు వచ్చిన కొందరికి రూ.1300 చొప్పున చెల్లించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మధ్య తరగతి ప్రజలు ఏక మొత్తంగా డిపాజిట్‌లు చేసి కరక్కాయలను కొనుగోలు చేశారు. సంస్థ మేనేజర్ ముప్పాల మల్లిఖార్జున్ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన వారికి అగ్రిమెంట్‌ల రూపంలో రసీదులు సైతం ఇచ్చాడు. దీంతో అనేక మంది లక్షలు చెల్లించి కరక్కాయలను కొనుగోలు చేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరుకుల బస్వరాజ్ అనే వ్యక్తి మొదట్లో రెండు వేలు వెచ్చించి రెండు కిలోల కరక్కాయలను కొనుగోలు చేశారు. అనంతరం పొడిగా మార్చి తీసుకురావడంతో అతనికి రూ.2600 ఇచ్చారు. దీనికితోడు సంస్థ పలు ఆఫర్లను ప్రకటించడం, డోర్ డెలివరీ పేరుతో సేవలను ప్రకటించడంతో అనేక మంది ఇళ్ల వద్ద ఉండే డిపాజిట్‌లు చెల్లించి కరక్కాయలను ఇళ్లవద్దకే తెప్పించుకున్నారు. బస్వరాజ్ అతని స్నేహితులు సుమారు రూ.40లక్షలు చెల్లించి కరక్కాయలను తీసుకొని పొడిగా మార్చి తీసుకువచ్చారు.
అగ్రిమెంట్ ప్రకారం అతడికి సోమవారం డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంది. ఉదయం సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్ ప్రసన్న అతడికి ఫోన్‌చేసి తమ సంస్థలో కీలక పాత్రధారి మల్లిఖార్జున్ ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి ఉందని, అతను అందుబాటులో లేడని తెలిపింది. బాధితులు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ సమాదాధానం చెప్పేవారు లేకపోవడంతో తాము మోసపోయినట్లు గుర్తించి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.5కోట్లకు పైగా వసూలు చేసిన సంస్థ ప్రతినిధులు ఉడాయించారని బాధితులు పేర్కొంటున్నారు. ఫిర్యాదు స్వీకరించిన సీఐ కుషాల్కర్ ఉన్నతాధికారుల సూచనమేరకు అదనపు ఇన్‌స్పెక్టర్ గోపీనా«థ్‌కు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment