సాక్షి ప్రతినిధి, చెన్నై: గతంలో వెలగబెట్టింది బాధ్యతతో కూడిన గౌరవప్రదమైన సైనికోద్యోగం. అయితే ఆ మానవ మృగంలో అలాంటి మంచి లక్షణాలు ఏ కోశానాలేవు. ఒకప్పుడు దేశాన్ని రక్షించే విధులు నిర్వర్తించిన ఇతడు నేడు ఓ చిన్నారి జీవితాన్నే భక్షించేశాడు. తాతా అంటూ ముద్దుగా పిలిచే నాలుగేళ్ల పాప జీవితాన్ని చిదిమేశాడు. తన కామప్రకోపానికి చిన్నారి ప్రాణాలనే హరించిన క్రూరమైన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నై శివారు తిరుముల్లవాయల్ చెందిన రాజేంద్రన్ అంబత్తూరు పారిశ్రామికవాడలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సెందమిళ్‌సెల్వి, రెండోతరగతి చదువుతున్న కుమారుడు కార్ముగిలన్ (7), ఎల్‌కేజీ చదువుతున్న కుమార్తె (4) ఉన్నారు. రాజేంద్రన్ ఇంటి పక్కనే వారి దూరపు బంధువు మీనాక్షి సుందరం (60) అనే మాజీ సైనికుడు భార్య రాజమ్మాళ్‌తో కలిసి నివసిస్తున్నాడు. 1993లో అతడు సైనికుడిగా ఉద్యోగ విరమణ చేశాడు. బంధువులు కావడంతో రెండిళ్ల మధ్య రాకపోకలు సాగేవి. రాజేంద్రన్ పిల్లలు మీనాక్షి సుందరంను తాతా అని పిలుచుకుంటూ ఆప్యాయంగా మెలిగేవారు.
ఇదిలా ఉండగా, గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో సెందమిళ్‌సెల్వి నాలుగేళ్ల కుమార్తెను ఇంట్లో ఒంటరిగా ఉంచి కుమారుడిని ట్యూషన్‌లో విడిచిపెట్టేందుకు వెళ్లింది. ప్రధాన ద్వారం తలుపునకు తాళం వేసుకుని పెరటి తలుపులు దగ్గరగా వేసి వెళ్లిన ఆమె కొద్దిసేపటి తరువాత ఇంటికి రాగా కుమార్తె కనిపించలేదు. ఇల్లంతా గాలించినా, పరిసరప్రాంతాలన్నీ వెదికినా ఫలితం లేకపోవడంతో తండ్రి రాజేంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి, బంధువులు మరోసారి ఇల్లంతా గాలించగా బాత్‌రూములోని ఒక బకెట్‌లో గోనెసంచిలో కుక్కినస్థితిలో కుమార్తె శవంగా పడి ఉంది. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని వైద్యపరీక్షలకు పంపగా తలపై, జననాంగం వద్ద తీవ్రగాయాలతో హత్యకు గురైనట్లు గుర్తించారు.
ఈ క్రమంలో రాజేంద్రన్‌తోపాటూ పోలీసులు సైతం మీనాక్షి సుందరంను అనుమానించారు. అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా బెడ్‌రూములో విరిగిపోయిన చిన్నారి చెవికమ్మలు, గాజులు, తల వెంట్రుకలు లభ్యమయ్యాయి. బెడ్ రూము స్క్రీన్‌లో రక్తపు మరకలను గుర్తించారు. బాత్‌రూమును ఎక్కువ మోతాదులో ఫినాయిల్‌తో శుభ్రం చేసి ఉంది. ఈ పరిణామాలతో పోలీసుల అనుమానం మరింత బలపడగా మీనాక్షి సుందరంను అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ సంబంధం లేదని బుకాయించాడు. ఎవరో ఈ ఘాతకానికి పాల్పడి చిన్నారి గాజులు, కమ్మలను మా ఇంట్లో వేసి ఉంటారని అతని భార్య రాజమ్మâ కూడా పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు తమదైనశైలిలో విచారించగా మీనాక్షి సుందరం నేరం ఒప్పుకున్నాడు.
నన్ను తాతా అని పిలిచేది
‘చిన్నారి కుటుంబ సభ్యులు నాకు దూరపు బంధువులు. ఆ పాప నన్ను తాతా..తాతా అని పిలిచేది. గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న సంగతిని తెలుసుకుని ఆడుకుందాం రా అంటూ మా ఇంటి బెడ్‌రూములోకి తీసుకెళ్లి లైంగికదాడికి దిగాను. ఈ సమయంలో కేకలు వేయడంతో నోటిని గట్టిగా మూసివేశాను. దీంతో ఊపిరాడక ప్రాణాలు విడిచింది. వెంటనే చిన్నారి మృతదేహాన్ని బియ్యం గోతంలో కుక్కి మా బాత్‌రూంలో పెట్టాను. చిన్నారిని వెతుక్కుంటూ రాజేంద్రన్ ఇంటివారు బయటకు వెళ్లి ఉన్న సమయం చూసి మరలా పెరటివైపు నుంచి ప్రవేశించి చిన్నారి మృతదేహాన్ని వారింటి బాత్‌రూము బకెట్‌లో పెట్టాను. ఏమీ తెలియనట్లుగా అందరితో కలిసి నేను కూడా వెతుకుతున్నట్లు నటించాను’ అని నిందితుడు మీనాక్షి సుందరం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సంఘటన జరిగిన సమయంలో అతడి భార్య రాజమ్మాళ్ మరో గదిలోనే ఉన్నా ఈ ఘాతుకం ఆమెకు తెలియకపోవడం విచిత్రం. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై పాశవికంగా లైంగికదాడి చేసి హతమార్చిన నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ తిరుముల్లవాయల్ పోలీస్‌స్టేషన్ ముందు స్థానికులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయునికి పదేళ్ల జైలుశిక్ష
ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన ప్రధానోపాధ్యాయునికి కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కారైక్కాల్‌లోని ఒక ప్రయివేటు ఉన్నత పాఠశాలలో పక్కిరిస్వామి (44) ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలకు చెందిన ఐదేళ్ల విద్యార్థినిని బెదిరించి 2017 ఆగస్టు 21వ తేదీన లైంగికదాడి చేశాడు. తిరునల్లారు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందిడికి పదేళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కారాక్కాల్ కోర్టు న్యాయమూర్తి శివకటాక్షం గురువారం తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment