సీఆర్పీఎఫ్ జవాన్ల మృతదేహాలకు నివాళులు
శ్రీనగర్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామా జిల్లా లెత్‌పొరాలోని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) క్యాంప్‌పై జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాదులు దాడి జరిపి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. గ్రెనేడ్ లాంఛర్లు, ఆటోమేటిక్ ఆయుధాలు ధరించిన కొందరు ముష్కరులు ఆదివారం వేకువజామున సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్దకు వచ్చీ రావటంతోనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. క్యాంప్ లోపలికి దూసుకెళ్లటానికి వారు చేసిన యత్నాలను సీఆర్పీఎఫ్ గార్డులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులు కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఉగ్రవాది కూడా మరణించి ఉంటాడని, అతని మృతదేహం కోసం క్యాంప్‌లో గాలిస్తున్నామని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి రాజేశ్ యాదవ్ తెలిపారు. అమరులైన వారిని సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ తౌఫయిల్ అహ్మద్, ఇన్‌స్పెక్టర్ కుల్దీప్ రాయ్ (హిమాచల్ ప్రదేశ్), కానిస్టేబుళ్లు.. షరీఫుద్దీన్ గనీ (బుద్గాం), రాజేందర్ నైన్(రాజస్థాన్), పీకే పాండా(ఒడిశా)గా గుర్తించారు. చనిపోయిన ఉగ్రవాదులను మంజూర్ అహ్మద్ బాబా(పుల్వామా), ఫర్దీన్ అహ్మద్ ఖన్‌దే(త్రాల్)గా భావిస్తున్నారు. వీరి వద్ద ఉన్న మారణాయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ పోలీసులను పెద్ద సంఖ్యలో క్యాంప్‌నకు తరలించారు. ఈ దాడికి తమదే బాధ్యతని పాక్ ప్రేరేపిత జైష్–ఎ–మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
పాక్ కాల్పుల ఉల్లంఘన
రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసీ) వెంబడి భారత పోస్టులపైకి పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఒక జవాను చనిపోయాడు. వేకువ జామున పాక్ బలగాలు రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లోని భారత్ ఫార్వర్డ్ పోస్టుల పైకి కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పంజాబ్‌కు చెందిన జవాను ప్రాణాలు కోల్పోయాడు. అదేవిధంగా పూంఛ్ జిల్లా దిగ్వార్ సెక్టార్‌లో అర్ధరాత్రి నుంచి వేకువజాము 5.30 గంటల వరకు పాక్ బలగాలు కాల్పులు కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ జమ్మూకశ్మీర్‌లోని భద్రతా బలగాల యుద్ధ సన్నద్ధత, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష జరిపారు. రాజౌరీ సెక్టార్‌లోని నియంత్రణాధీన రేఖ వెంబడి ఫార్వర్డ్ పోస్టులను ఆదివారం పరిశీలించారు.
డిసెంబర్ 10వ తేదీ వరకు ఎల్‌వోసీ వెంబడి పాక్ కాల్పుల ఉల్లంఘన ఘటనలు 881 జరగ్గా, గత ఏడేళ్లలో ఇదే అత్యధికం కావటం గమనార్హం. దీంతోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నవంబర్ వరకు మొత్తం 110 సార్లు పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ ఘటనల్లో 14 మంది సైనికులు, 12 మంది పౌరులు, నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు అమరులయ్యారని సైన్యం తెలిపింది. 2003లో భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మొత్తం 3,323 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది.
‘పుల్వామా దాడి ప్రధాని వైఫల్యం’
పుల్వామా సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి ప్రధాని మోదీ విదేశాంగ విధానం వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ మండిపడింది. దేశ విరోధులకు గట్టిగా బుద్ధి చెబుతామని ఎన్నికల సమయంలో చెప్పిన మోదీ మాటలు ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుశ్మితా దేవ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment