అయ్యో.. దేవుడా ఎంత ఘోరం! | Four School Girls Accidental Died Mahabubnagar | Sakshi
Sakshi News home page

అయ్యో.. దేవుడా ఎంత ఘోరం!

Published Tue, Apr 9 2019 11:42 AM | Last Updated on Tue, Apr 9 2019 11:44 AM

Four School Girls Accidental Died Mahabubnagar - Sakshi

మృత్యువాత పడిన చిన్నారులు వెంకటేశ్వరి, చిన్నారి , కవిత, యమున, చిన్నారి

‘అయ్యో.. దేవుడా! ఇంత ఘోరమా.. ముక్కుపచ్చలారని మా పిల్లలు ఐదుగురిని ఒకేసారి తీసుకునిపోతివా..’  అంటూ బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కలచివేసింది. మల్దకల్‌మండలం నాగర్‌దొడ్డికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు చిన్నారులు సోమవారం సాయంత్రం ఆడుకుంటూ శివారులోని రిజర్వాయర్‌ వద్దకు వెళ్లి అక్కడి బావి గుంతలో పడి మృత్యువాత పడటంతో విషాదం అలుముకుంది.                 

ఉదయం ఎంచక్కా స్కూలుకు వెళ్లొచ్చారు. సాయంత్రం కాసేపు రిజర్వాయర్‌ నీటిలో ఆడుకుందామని ఆవుతోపాటు వెళ్లడమే.. ఆ చిన్నారుల జీవితాలకు నిండునూరేళ్లు నిండేలా చేసింది. ఎక్కడికి వెళ్లినా జాగ్రత్త బాబూ.. అంటూ చెప్పే తల్లిదండ్రులు ఊహించలేదు ఆ చిన్నారులకు కానరాని లోకాలు వెళ్తారని... మృత్యువు ఎప్పుడు ఏ విధంగా వెంటాడుతుందో చిన్నారులు పసిగట్టలేకపోయారు. అందరూ చిన్నపిల్లలు కావడంతో.. అప్రమత్తం కాలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరిని  వరుసగా ఐదుగురిని నీటిగుంట మింగేసింది. ఈ దుర్ఘటన మల్దకల్‌ మండలం నాగర్‌దొడ్డి గ్రామాన్ని విషాదంలోకి నెట్టేసింది. బాధిత కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది.

మల్దకల్‌ (గద్వాల) : మల్దకల్‌ మండలం నాగర్‌దొడ్డి గ్రామంలోని బావి గుంతలో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృత్యువాత పడ్డారు. సోమవారం జరిగిన ఈ సంఘటన ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన బాలికలు కాగా, మరో ఇద్దరు బాలికలు ఇతర కుటుంబాలకు చెందిన వారు. నాగర్‌దొడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లప్ప, మాణిక్యమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో యుమున(12), చిన్నారి(11), వెంకటేశ్వరి (10) మృత్యువాతపడ్డారు. అదే గ్రామానికి చెందిన కుమ్మరి కృష్ణ, పద్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో చిన్నారి (8) మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన చిన్న కుర్వ వెంకటేష్, జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కవిత(11) మృతిచెందిన వారిలో ఉన్నారు.

సరదానే ప్రాణాలమీదికొచ్చింది.. 
చిన్నారులంతా పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఒంటిపూట బడులు కావడం, చిన్నారులంతా ఆటల్లో మునిగి తేలారు. ఈ క్రమంలో సాయంకాలం కావడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆవును దగ్గరలో ఉన్న పొలాల వద్ద మేపేందుకు తీసుకెళ్లారు. ఈ సంతోషమే వారిని మృత్యు ఒడిలోకి చేర్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంకాలం సుమారు 4.30గంటల ప్రాంతంలో ఆవుతో పాటు ఐదుగురు చిన్నారులు వెళ్లారు. చివరగా గంటన్నర వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులంతా కూడా దినసరి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే తమ పనులు ముగించుకొని ఇంటికి చేరుకోగానే పిడుగులాంటి వార్త విని నిశ్చేష్టులయ్యారు. 

తల్లడిల్లిన కుటుంబ సభ్యులు
భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో చిన్నారులను పాఠశాలకు పంపించేవారు ఆ తల్లిదండ్రులు. నిరక్షరాస్యులైన కుటుంబాలకు అక్షర జ్యోతులను వెలిగిద్దామని బుడి బుడి అడుగులు వేసిన బాల్యానికి బావిగుంత మృత్యుపాశమవగా.. ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. తాము ఇంటికి వెళ్లగానే ఏం తెచ్చావనే ప్రశ్నించే చిన్నారులు విగతజీవులుగా పడి ఉండడంతో గుండెలు బాదుకొని రోదించారు. ఆ దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఇక తోటి స్నేహితులు సైతం తమ స్నేహితులు లేరని తెలుసుకొని దీనస్థితికి చేరుకున్నారు.

ప్రముఖుల పరామర్శ
ఐదుగురు చిన్నారులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండారి భాస్కర్, ఎస్పీ లక్ష్మీనాయక్, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కోఆపరేటివ్‌ కన్జ్యూమర్‌ ఫోరం చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, సర్పంచ్‌ బండ్ల జ్యోతి, డీఎస్పీ షాకీర్‌హుసేన్‌ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వపరంగా కుటుంబాలను ఆదుకుంటామని చిన్నారుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. సంఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మల్దకల్‌ ఎస్‌ఐ కృష్ణ ఓబుల్‌రెడ్డి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆవుతోక పట్టుకొని వెళ్లి..
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రోజూలానే సోమవారం గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు వెళ్లారు. అందరూ కూడా ఇంచుమించు ఒకే వయస్సు గల చిన్నారులు కావడంతో కలిసి మెలిసి ఆడుకునేవారు. సాయంత్రం 5గంటల సమయంలో గ్రామ సమీపంలోని రిజర్వాయర్‌లోని ఆడుకునేందుకు బయల్దేరారు. అరకొర నీటిలో ఆడుకుంటూ ముందుకు సాగారు. అయితే కుమ్మరి ఎల్లప్పకు చెందిన ఆవును కూడా వారితో పాటే తీసుకెళ్లారు. అక్కడ లోతుగా ఉన్న పెద్ద గుంత ఉంది. అది గమనించని చిన్నారులు అలాగే ఆవుతో పాటు నీటిలో నడుస్తూ వెళ్లారు. ప్రమాదవశాత్తు ఐదుగురు చిన్నారులు పెద్ద గుంతలో పడిపోయారు. పడిన వెంటనే పెద్ద ఎత్తున కేకలు వేసినా చుట్టు ప్రక్కల ఎవరూ లేకపోవడంతో చిన్నారులు నీటిలో మునిగిపోయారు. చిన్నారులకు ఈత రాకపోవడం, నీటిలో ఊపిరాడక మృతి చెందారు.

తెలిసిందిలా..
ఇదిలాఉండగా, మృతిచెందిన చిన్నారి యమున తండ్రి ఫోన్‌ ఇంట్లో ఉండడంతో ఫోన్‌ కూడా తనతో పాటే తీసుకెళ్లింది. ఈ ఫోన్‌ ప్రమాదం జరిగిన నీటి గుంత ఒడ్డుపైనే ఉంది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ రైతు కుమ్మరి ఎల్లప్పకు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ ఎంతసేపటికీ ఎత్తకపోవడంతో ఆ రైతు ఇంటివద్దకు వెళ్లి ఫోన్‌ ఎత్తడం లేదని ప్రశ్నించాడు. ఫోన్‌ తన వద్ద లేదని వివరించాడు. అయితే మీ ఆవు వ్యవసాయ పొలం వద్ద ఉందని, మీ పిల్లలు ఎక్కడున్నారనే మాట కలిపాడు.

దీంతో హుటాహుటిన ఆవుతో పాటే పిల్లలు వెళ్లారని గ్రహించి అక్కడికి చేరుకున్నారు. ఫోన్‌ ఒడ్డుపైనే ఉండటం చూసి ఖంగుతిన్నారు. అటూ ఇటూ వెతకసాగారు. ఒకవేళ గుంతలో పడ్డారేమోనన్న అనుమానంతో గుంతలోకి దిగి వెతకగా చిన్నారుల మృతదేహాలు ఒక్కొక్కటికి బయట పడ్డాయి. అయితే కవిత మృతదేహం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఇక మరోసారి స్థానికుల సాయంతో వెతకగా రాత్రి 8గంటల ప్రాంతంలో కవిత మృతదేహం లభ్యమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement