
వారణాసి: కన్నతల్లి చనిపోతే ఎటువంటి వ్యక్తులైనా కంటతడి పెడతారు. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి కొడుకులుగా పుట్టినందుకు తమ రుణం తీర్చుకుంటారు. కానీ తల్లి చనిపోయినా ఆమెకు వచ్చే పింఛన్‌పై కన్నేశారు నలుగురు సుపుత్రులు. ఆమె మృతదేహాన్ని ఐదు నెలలపాటు ఇంట్లోనే పెట్టుకున్నాడు. చివరికి విషయం బయటపడడంతో జైలు పాలయ్యారు. ఈ విచారకర ఘటన వారణాసిలోని కబీర్ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కబీర్ నగర్‌కు చెందిన అమరావతి దేవి(70)కి ఐదుగురు కొడుకులు, ఒక కుమార్తె. ఆమె తన నలుగురు కుమారులు, కుమార్తెతో కలిసి ఒకే చోట నివాసం ఉంటుండగా, ఒక కొడుకు మాత్రం వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
కొద్ది రోజుల క్రితం కస్టమ్స్ శాఖలో ఉద్యోగం చేస్తున్న అమరావతి భర్త చనిపోయాడు. దీంతో ఆమె నెలకు రూ.13000 పింఛన్ తీసుకుంటుంది. ఈ ఏడాది జనవరిలో అమరావతి దేవి ఆరోగ్యం క్షీణించడంతో నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. దీంతో జనవరి 13న అమరావతి కన్నుమూశారు. తొలుత అమె మరణాన్ని కుటుంబ సభ్యులు ప్రకటించారు. కానీ అంతలోనే చిన్నకుమారుడు అమ్మ చేతులు కదులుతున్నాయని చెప్పి చనిపోలేదని కోమాలోకి వెళ్లిందని అబద్దం చెప్పారు. దీంతో ఆమె శవాన్ని ఇంట్లోనే ఉంచి వాసన రాకుండా రసాయనాలు చల్లారు. ఆమె పేరు చెప్పి ప్రతి నెల పింఛన్ డబ్బులు డ్రా చేసుకున్నారు.
ఇదంతా గమనించిన ఓ వ్యక్తి పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ ఘటనపై భేలుపూర్ సర్కిల్ ఆఫీసర్ ఏపీఖాన్ మాట్లాడుతూ.. నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇంట్లో అమరావతి సంతకం చేసి ఉంచిన ఐదు బ్లాంక్ చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా తమ తల్లి కోమాలోకి వెళ్లిందని, రోజూ పాలు తాగుతుందని అమారావతి దేవి కొడుకొకరు చెప్పారు. పోస్ట్ మార్టం వివరాలు వచ్చాక అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment