ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : డబ్బుకోసం ఓ యువతిని స్నేహమంటూ నమ్మించి ఆపై విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శుక్రవారం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు... న్యూఢిల్లీకి చెందిన 28ఏళ్ల వస్త్రాల వ్యాపారి జూదం కారణంగా దాదాపు రూ.50లక్షల అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులకు తోడు ఓ ఖరీదైన కారును లోన్‌లో తీసుకున్నాడు. దీంతో ఎలాగైనా అప్పులు మొత్తం తీర్చేయ్యాలన్న కసితో ఓ పన్నాగం పన్నాడు. అదే ప్రాంతానికి చెందిన 21ఏళ్ల సంపన్న యువతితో స్నేహం పెంచుకున్నాడు. యువతి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలుసుకున్నాడు. అదే అదునుగా భావించిన ఆ వ్యాపారి.. ఆ ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్నపుడు వెళ్లి ఆమెను చంపి డబ్బుతో చెక్కేయాలనుకున్నాడు.
పథకం ప్రకారం బ్యాగులో కత్తి, సుత్తె, పెనాయిల్‌తో వేలి ముద్రలు పడకుండా ఉండటానికి చేతులకు సాక్సులు ధరించి స్కూటర్‌లో యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు కొట్టగానే యువతి బయటకు వచ్చింది. అతడు వెంట తెచ్చుకున్న కత్తితో యువతిని మూడు సార్లు పొడిచాడు. అయితే ఆ సమయంలో ఇంట్లో వేరే వ్యక్తులు ఉన్నారని గ్రహించి అక్కడినుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించగా ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వటంతో నిందితున్ని తొందరగానే పట్టుకోగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment