తిరువనంతపురం : కేరళ వచ్చిన ఓ జర్మన్ దేశస్థురాలు నాలుగు నెలలుగా కనిపించకపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సదరు మహిళకు ఉగ్రసంస్థలతో సంబంధాలున్నట్లు ఇంటర్‌పోల్ భావిస్తోంది. ఈ క్రమంలో సాధ్యమైనంత తొందరగా ఆమె ఆచూకీ కనుక్కోవాలంటూ కేరళ పోలీసుల మీద ఒత్తిడి తెస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. వివరాలు.. జర్మనీకి చెందిన లీసా వైసే(31) అనే మహిళ ఈ ఏడాది మార్చి 7న యూకేకు చెందిన అలీ మహ్మద్ అనే వ్యక్తితో కలిసి తిరువనంతపురం వచ్చింది. వల్లికావు, కొల్లంలో ఉన్న మాతా అమృతానందమయి మఠాన్ని దర్శించడానికి ఇండియా వచ్చినట్లు లీసా తన ఎంబార్కేషన్ ఫామ్‌లో పేర్కొంది.
2011లో కూడా లీసా ఈ మఠాన్ని సందర్శించడానికి వచ్చిందని.. 2 నెలల పాటు ఇండియాలోనే ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మార్చి 7న తిరువనంతపురం వచ్చిన లీసా.. అదే నెల 10వ తేదీ వరకూ తన కుటుంబ సభ్యులతో కాంటాక్ట్‌లో ఉంది. ఆ తర్వాత లీసా నుంచి ఎటువంటి ఫోన్ రాలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వడమే కాక గూగుల్ అకౌంట్స్ కూడా డిలీట్ చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో లీసా తల్లి కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 11 రోజుల పాటు లీసా గురించి వెతికినప్పటికి ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదంటున్నారు పోలీసులు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు మాతా అమృతానందమయి మఠానికి వెళ్లి విచారించగా లీసా, మహ్మద్ అనే వ్యక్తులు తమ ఆశ్రమానికి రాలేదని వారు తెలిపారు. లీసా వీసా గడువు ఏప్రిల్ 5తో ముగిసింది. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికి లీసా గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. దాంతో కేరళ పోలీసులు లీసా ఫోటో, వివరాలను ఇతర రాష్ట్రాల పోలీస్ స్టేషన్లకు పంపడమే కాక లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాక ఈ కేసు విషయంలో ఇంటర్‌పోల్ సాయం కూడా కోరారు. అయితే లీసాకు ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నట్లు ఇంటర్‌పోల్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ విషయం గురించి కేరళ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘లీసా, మహ్మద్ కోవలంలోని ఓ హోటల్‌లో దిగారని, వర్కాల వెళ్లారని మా దర్యాప్తులో తెలీంది. అయితే లీసా, మహ్మద్‌లు ఇద్దరు.. విదేశీయులు ఇండియాలోని హోటల్లోలో కానీ ఇళ్లలో కానీ నివాసం ఉండటానికి అవసరమైన అతి ముఖ్యమైన ఫామ్ సీని నింపలేదు. లీసాతో పాటు వచ్చిన మహ్మద్ మార్చి 15న యూకే వెళ్లినట్లు తెలిసింది. కానీ లీసా మాత్రం ఇప్పటి వరకూ ఇండియాను విడిచి వెళ్లలేదు. మా అనుమానం ప్రకారం లీసా మత సంస్థలు నడుపుతున్న హస్టల్‌లో లేదా.. ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో ఉండి ఉండవచ్చు’ అని పోలీసులు అభిప్రాయపడ్డారు.
ఎవరీ లీసా..
జర్మన్ దేశస్థురాలైన లీసా యూదు మతస్తురాలు. అయితె 2012లో ఆమె ఇస్లాంలోకి మారారు. అప్పటి నుంచి ఆమె ఈజిప్ట్‌లోని ఓ ఎన్జీవీతో కలిసి పని చేస్తుంది. కొద్దికాలానికి లీసా అమెరికాకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ హషీమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. కానీ 2016లో లీసా, తన భర్త నుంచి విడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment