అస్మిత మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి, బెళుగుప్ప(అనంతపురం) : తగ్గుపర్తి గ్రామ సమీపంలోని నీటికుంట ఓ బాలికను మింగింది. దప్పిక తీర్చుకునేందుకు వెళ్లిన బాలికను నీటికుంట మింగేసింది. మరొక బాలికను అటుగా వచ్చిన ఓ రైతు గమనించి రక్షించాడు. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తగ్గుపర్తి దళితవాడకు చెందిన అస్మిత (13) స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. దసరా సెలవులు రావడంతో ఇంటివద్దనే ఉంటోంది. మంగళవారం స్నేహితులు చిన్ని, శాలినితో కలిసి నల్లరేగడి భూముల్లోనూ, గట్లపైనా కాచే చిన్న కాకరకాయలను తీయడానికి వెళ్లింది. ఎండ తీవ్రతకు దప్పిక వేయడంతో నీటి కోసం వెదికింది. సమీపంలోనే గాలిమరల కంపెనీల రహదారుల కోసం మట్టిని తవ్వగా ఏర్పడిన గుంతల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. లోతు గమనించని చిన్నారులు నీరు తాగేందుకు వెళ్లారు. నీరు తాగుతున్న సమయంలో అస్మిత కాలుజారి కుంటలోకి పడిపోయింది.
కాపాడే ప్రయత్నంలో స్నేహితురాలు చిన్ని సైతం పడిపోయింది. గట్టుపై ఉన్న శాలిని గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో పెట్రోలు అయిపోయి ద్విచక్రవాహనం తోసుకుంటూ వస్తున్న రైతు లక్ష్మినారాయణ అక్కడకు చేరుకుని చిన్నిని ఒడ్డుకు చేర్చాడు. లోతు ఎక్కువ ఉన్న చోట మునగడంతో అస్మిత దొరకలేదు. కొంతసేపటి తర్వాత మరికొందరితో కలిసి నీటికుంటలోకి దిగి అస్మితను బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే అస్మిత ప్రాణం విడిచింది. ‘ఇంతవరకు కళ్ల ముందు ఆడుకుంటూ ఉంటిరే.. అంతలోనే కానరాని లోకాలకు వెళ్తివా బిడ్డా’ అంటూ అస్మిత తల్లిదండ్రులు మారెక్క, వన్నరూప్పలు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment