గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు
గుంతకల్లు: గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు సమీపంలోని పడమటి గుంతకల్లు సేష్టన్ యార్డులో మంగళవారం గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వేకు సూమారు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండవచ్చని రైల్వే వర్గాలు తెలిపాయి. ఘటనకు వివరాల్లోకెళితే... నార్త్ సెంట్రల్ రైల్వేలోని బేలాయ్ ఉక్కు కర్మాగారం నుండి హుబ్లీ జోనల్ కేంద్రమైన హుబ్లీకి ఇనుప కంబీలు (రైల్స్)ను రైల్వే డిపార్టుమెంట్‌కు చెందిన ప్రత్యేక గూడ్స్‌రైలు (20 ఆర్‌పీ బీటీ) ద్వారా తరలిస్తున్నారు. ఈ రైలు మార్గ మధ్యలో అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వెస్ట్ గుంతకల్లు రైల్వేసేష్టన్ యార్డులో 254/2–3 కి.మీ వద్ద మెయిన్‌లైన్ నుంచి లూప్‌లైన్ లోకి ప్రవేశిస్తుండగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 5 వ్యాగిన్లు పట్టాలు తప్పాయి. 24 వ్యాగిన్లతో వెళ్తున్న ఈ రైలు ఇంజన్ 7వ వ్యాగిన్ నుంచి వరుసగా 12వ వ్యాగిన్ వరకు పట్టాల నుంచి పక్కకు ఒరిగాయి. ఇందులో ఎన్‌సీఆర్ 135601, 35162 వ్యాగిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుంతకల్లు–బళ్లారి రైలు మార్గం డబుల్‌లైన్ కావడంతో మరో లైన్‌లో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
ఈ ఘటనతో దాదాపు 300 మీటర్ల మేర రైలు మార్గం ధ్వంసం కావడంతో పాటు సమాచార వ్యవస్థ దెబ్బతినింది. వ్యాగిన్లు, రైలు మార్గం, స్లీపర్లు, రోలింగ్ స్టాక్, సమాచార వ్యవస్థ ధ్వంసం కావడంతో సుమారు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. డీఆర్‌ఎం విజయ్‌ప్రతాప్‌సింగ్‌తో పాటు సీనియర్ డీఎంఈ (సీఅండ్‌డబ్ల్యూ) వెంకటరావు, సీనియర్ డీఈఎన్ (కోఆర్డినేషన్) సిద్ధేశ్వరరావు, సీనియర్ డీసీఎం రాకేష్, సీనియర్ డీఈఈలు రాజేంద్రకుమార్, అంజయ్య, డీసీఎం నాగేంద్రప్రసాద్, డీఈఎన్ (వర్క్) నవ్యశ్రీతో పాటు ఆయా విభాగాల అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
దాదాపు 500 మందికి పైగా రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే దెబ్బతిన్న సమాచార వ్యవస్థను పునరుద్ధరించారు. ప్రమాద కారణంగా హుబ్లీ–విజయవాడ, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్లు, హైదరాబాద్–కోల్హాపూర్, విశాఖపట్నం–హుబ్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు డౌన్‌లైన్ రైలు మార్గం గుండా అలస్యంగా నడిచాయి.
నిర్లక్షమే కారణమా?
పడమటి గుంతకల్లు రైల్వే సేష్టన్ యార్డులో గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం రైలు మార్గ నిర్వహణ లోపమే అయి ఉండొచ్చని రైల్వే వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలు ప్రకారం అధిక టన్ను బరువుతో (రైల్స్) ప్రయాణిస్తున్న ఈ గూడ్స్ రైలు ప్రధాన మార్గం గుండా వెళ్లాలి. సిబ్బంది అజాగ్రత్త కారణంగా మొయిన్ లైన్ నుంచి లూప్‌లైన్ మళ్లించడంతో ప్రమాదనికి గురై ఉండొచ్చునని త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
విచారణ చేస్తున్నాం
ప్రమాద సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాం. విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. బాధ్యులెవరైనా సరే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– విజయ్‌ప్రతాప్ సింగ్, డీఆర్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment