
లక్నో: లక్నోలో బ్రైట్‌లాండ్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న ఓ బాలిక(11) సెలవు దొరుకుతుందని అదే పాఠశాలలో చదువుతున్న రితిక్(6) అనే చిన్నారిపై జనవరి 16న హత్యాయత్నం చేసింది. పాఠశాల వాష్‌రూమ్‌లో పదునైన కత్తితో రితిక్ కడుపు, ఛాతీపై పొడిచింది. రక్తపు మడుగులో ఉన్న రితిక్‌ను పాఠశాల సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆధారాలను దాచిపెట్టినందుకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మానస్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాలికను త్వరలో జువనైల్ బోర్డు ముందు హాజరుపరుస్తారు.
‘నీపై దాడిచేసి గాయపరిస్తేనే పాఠశాలకు సెలవు ప్రకటిస్తారు’ అని దాడికి ముందు బాలిక రితిక్‌తో వ్యాఖ్యానించిందన్నారు. ‘ఓ అక్క నన్ను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి వైపర్‌తో కొట్టి ఆతర్వాత కత్తితో దాడిచేసింది’ అని వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిందితురాలి ఫొటోను చూడగానే తనపై దాడిచేసింది ఆ అమ్మాయేనని రితిక్ తెలిపాడన్నారు. బ్లూవేల్ తరహా ఆటకు బానిసయ్యే ఈ దారుణానికి పాల్పడినట్లు బాలిక తమ విచారణలో అంగీకరించిందని తెలిపారు. గతేడాది ఈ బాలిక రెండు సార్లు ఇంట్లో నుంచి పారిపోయిందనీ, ఓసారి రూ.లక్ష నగదును ఎత్తుకెళ్లిందని వెల్లడించారు. రితిక్ ఆరోగ్యపరిస్థితిని సీఎం యోగి ఆస్పత్రికి వెళ్లి తెల్సుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment