Bluewale game
-
సెలవు కోసం హత్యచేయబోయింది!
లక్నో: లక్నోలో బ్రైట్లాండ్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న ఓ బాలిక(11) సెలవు దొరుకుతుందని అదే పాఠశాలలో చదువుతున్న రితిక్(6) అనే చిన్నారిపై జనవరి 16న హత్యాయత్నం చేసింది. పాఠశాల వాష్‌రూమ్‌లో పదునైన కత్తితో రితిక్ కడుపు, ఛాతీపై పొడిచింది. రక్తపు మడుగులో ఉన్న రితిక్‌ను పాఠశాల సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆధారాలను దాచిపెట్టినందుకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మానస్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాలికను త్వరలో జువనైల్ బోర్డు ముందు హాజరుపరుస్తారు. ‘నీపై దాడిచేసి గాయపరిస్తేనే పాఠశాలకు సెలవు ప్రకటిస్తారు’ అని దాడికి ముందు బాలిక రితిక్‌తో వ్యాఖ్యానించిందన్నారు. ‘ఓ అక్క నన్ను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి వైపర్‌తో కొట్టి ఆతర్వాత కత్తితో దాడిచేసింది’ అని వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నారు. నిందితురాలి ఫొటోను చూడగానే తనపై దాడిచేసింది ఆ అమ్మాయేనని రితిక్ తెలిపాడన్నారు. బ్లూవేల్ తరహా ఆటకు బానిసయ్యే ఈ దారుణానికి పాల్పడినట్లు బాలిక తమ విచారణలో అంగీకరించిందని తెలిపారు. గతేడాది ఈ బాలిక రెండు సార్లు ఇంట్లో నుంచి పారిపోయిందనీ, ఓసారి రూ.లక్ష నగదును ఎత్తుకెళ్లిందని వెల్లడించారు. రితిక్ ఆరోగ్యపరిస్థితిని సీఎం యోగి ఆస్పత్రికి వెళ్లి తెల్సుకున్నారు. -
‘బ్లూవేల్’పై డాక్యుమెంటరీ చేయండి
న్యూఢిల్లీ: చాలా మంది ప్రాణాలను బలిగొంటున్న బ్లూవేల్ వేల్ చాలెంజ్ గేమ్ దుష్ప్రభావాలను వివరిస్తూ ఒక వారంలోగా పది నిమిషాల కార్యక్రమాన్ని రూపొందించి ప్రదర్శించాలని దూరదర్శన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘మీరెలా చేస్తారో మాకు తెలీదు.. కానీ కచ్చితంగా ఈ పని చేసి తీరాలి’అని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం కన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల బెంచ్ ఆదేశించింది.బ్లూవేల్ చాలెంజ్ లాంటి ప్రమాదకర ఆటలను నిరోధించేందుకు మార్గదర్శకాలను రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది స్నేహ కలిటా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్.. డాక్యుమెంటరీని ప్రైమ్ టైమ్ సమయాల్లో ప్రైవేట్ చానళ్లలోనూ ప్రదర్శించేలా సంబంధిత అధికారులను ఆదేశించింది. -
బ్లూవేల్‌పై కేంద్రం వివరణ కోరిన హైకోర్టు
సాక్షి, ముంబయిః చిన్నారుల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న మృత్యు క్రీడ బ్లూవేల్ ఛాలెంజ్ ఆన్లైన్ గేమ్‌పై బాంబే హైకోర్టు గురువారం కేంద్రాన్ని వివరణ కోరింది. ఈ గేమ్‌ను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆన్లైన్ గేమ్‌ను నిషేధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నగరానికి చెందిన ఓ ఎన్జీవో ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రీడ బారిన పడిన పిల్లల కోసం 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. కాగా, ఈ గేమ్‌కు సంబంధించి ప్రభుత్వం ఓ అడ్వైజరీని జారీ చేసినట్టు గుజరాత్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఇదే అంశంపై కేంద్రం సమాచారం ఇచ్చిందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది హితేన్ వెనెగోంకర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మంజూలా చెల్లూర్కు నివేదించారు.ఇదే అంశాన్ని తెలుపుతూ వారంలోగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని చెల్లూర్ కోరారు. ప్రతి విషయానికి ప్రభుత్వం లేదా న్యాయస్ధానాలు అన్నీ చేస్తాయని భావించరాదని, తమ పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై తల్లితండ్రులూ ఓ కన్నేసి ఉంచాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. తల్లితండ్రులు తమ పిల్లలు కాలేజ్‌లో ఉన్నారని అనుకుంటారని, అయితే వాళ్లు మాత్రం ఇలాంటి ( బ్లూవేల్ తరహా) గేమ్స్ ఆడుకుంటూ ఎక్కడో ఉంటారని వ్యాఖ్యానించారు.