బ్లూవేల్‌పై కేంద్రం వివరణ కోరిన హైకోర్టు
సాక్షి, ముంబయిః చిన్నారుల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న మృత్యు క్రీడ బ్లూవేల్ ఛాలెంజ్ ఆన్‌లైన్ గేమ్‌పై బాంబే హైకోర్టు గురువారం కేంద్రాన్ని వివరణ కోరింది. ఈ గేమ్‌ను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆన్‌లైన్ గేమ్‌ను నిషేధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ నగరానికి చెందిన ఓ ఎన్‌జీవో ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రీడ బారిన పడిన పిల్లల కోసం 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.
కాగా, ఈ గేమ్‌కు సంబంధించి ప్రభుత్వం ఓ అడ్వైజరీని జారీ చేసినట్టు గుజరాత్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఇదే అంశంపై కేంద్రం సమాచారం ఇచ్చిందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది హితేన్ వెనెగోంకర్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మంజూలా చెల్లూర్‌కు నివేదించారు.ఇదే అంశాన్ని తెలుపుతూ వారంలోగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని చెల్లూర్ కోరారు.
ప్రతి విషయానికి ప్రభుత్వం లేదా న్యాయస్ధానాలు అన్నీ చేస్తాయని భావించరాదని, తమ పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై తల్లితండ్రులూ ఓ కన్నేసి ఉంచాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. తల్లితండ్రులు తమ పిల్లలు కాలేజ్‌లో ఉన్నారని అనుకుంటారని, అయితే వాళ్లు మాత్రం ఇలాంటి ( బ్లూవేల్ తరహా) గేమ్స్ ఆడుకుంటూ ఎక్కడో ఉంటారని వ్యాఖ్యానించారు.