
వడోదర : గుజరాత్‌లో ఓ బీజేపీ కౌన్సిలర్‌కు ప్రజలు చుక్కలు చూపించారు. నిర్మాణాల కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెట్టుకు కట్టేసి కొట్టారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. హష్ముఖ్ పటేల్ అనే వ్యక్తి గుజరాత్‌లో బీజేపీ కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. అయితే, వడోదర మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ఆదేశాల మేరకు స్ధానిక అధికారులు ఆ ప్రాంతాల్లోని ఇళ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చి వేశారు.
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఆ ప్రాంత వాసులంతా మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లగా తాము నోటీసులు పంపించామని, కౌన్సిలర్ వద్ద ఉన్నాయని చెప్పారు. దీంతో మరింత ఆగ్రహంతో అక్కడికి వెళ్లి ఆయనను ప్రశ్నించగా తనకు నోటీసులు అందలేదని తెలిపారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వారంతా కూడా ఆయనపై చేయి చేసుకున్నారు. చెట్టుకు కట్టేసి చొక్కా చింపేసి పిడిగుద్దులు గుప్పించారు. తమ ఇళ్లను కూల్చి వేసే నోటీసులు వచ్చినా ఎందుకు తమకు సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా కూడా మారింది. దీనికి సంబంధించి 30మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment