ఛండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. ఏ కారణం లేకుండానే ఓ వ్యక్తి ఆరుగురిని అతి కిరాతకంగా హతమార్చాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.
పల్వాల్‌లో ఈ ఉదయం వరుస హత్యలు చోటు చేసుకున్నాయి. రాడ్‌తో సంచరించిన ఆ వ్యక్తి పలువురిపై దాడి చేశాడు. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు ఆదర్శ్ కాలనీలో గాయాలతో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేకపోవటంతోనే అతను ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు.
మృత దేహాలను పోస్ట్‌మార్టంకు పంపిన పోలీసులు.. ఓ మహిళతోపాటు, ముగ్గురు వాచ్‌మెన్లు మృతుల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో హై అలెర్ట్ విధించిన పోలీసులు.. నిందితుడిని ఫరిదాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హంతకుడు మాజీ ఆర్మీ ఉద్యోగి
కాగా, అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ఆర్మీ మాజీ ఉద్యోగి నరేష్ ధన్కర్‌గా పోలీసులు వెల్లడించారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా విధులు నిర్వహించిన నరేష్ 2003లో వీఆర్‌ఎస్ తీసుకుని మూడేళ్ల తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. కలహాలతో భార్య కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం భివానీలో ఆయన ఎస్డీవోగా పని చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఆయన ఈ హత్యాకాండకు దిగగా.. ఉదయం 4గంటలలోపే ఆరుగురిని చంపేశారు. ఎట్టకేలకు ఉదయం 7 గంటలకు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన పోలీసులపై కూడా రాడ్‌తో దాడికి పాల్పడ్డాడంట. అయితే పోలీసులు అతికష్టం మీద ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నరేష్ భార్య, కొడుకును కూడా చంపేందుకు ఫ్లాన్ గీసుకున్నాడని పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment