విజయ్ దేవరకొండ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ నకిలీ పేజీ ఏర్పాటైంది. దీని ద్వారా యువతులకు వల వేస్తున్న మోసగాడు విజయ్ మాదిరిగా చాటింగ్స్ చేస్తున్నాడు. ఈ విషయం గుర్తించిన విజయ్ దేవరకొండ తన సహాయకుడినే మహిళగా రంగంలోకి దింపి చాటింగ్ చేయించారు. విషయం రూఢీ కావడంతో మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు తన మేనేజర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. ఫేస్‌బుక్‌లో విజయ్ దేవరకొండ పేరుతో కొన్నాళ్ల క్రితం ఓ నకిలీ పేజ్ ఏర్పాటైంది. దీన్ని చూసిన అనేక మంది ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. ఇలాంటి రిక్వెస్ట్‌ల్లో యువతులకు సంబంధించినవి గుర్తిస్తున్న మోసగాడు వారితో మెసెంజర్ ద్వారా చాటింగ్‌కు దిగుతున్నాడు.
(చదవండి : ‘క్లబ్ రౌడీ..మేం రెడీ... ’)
కొన్ని రోజుల తర్వాత తొలుత తనకు డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టుతో చాటింగ్ చేయాలని, పూర్వాపరాలు పరిశీలించిన అతడు చేసే సిఫార్సు ఆధారంగా నేను చాటింగ్ చేస్తానంటూ విజయ్ దేవరకొండ మాదిరిగా సదరు మోసగాడు చెప్తున్నాడు. ఆపై తన డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటూ ఓ ఫోన్ నంబర్ ఇస్తున్నాడు. దీంతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తున్న యువతులతో అతగాడు ప్రేమ, పెళ్లి, సహజీవనం అంటూ ఎర వేయడం చేస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని ఇటీవల కొందరు సన్నిహితులు విజయ్ దేవరకొండ దృష్టికి తీసుకెళ్లారు. సదరు మోసగాడికి చెందిన వాట్సాప్ నంబర్ సైతం అందించారు. దీంతో అసలు నిజం తెలుసుకోవాలని భావించిన ఆయన తన వద్ద సహాయకుడిగా పని చేసే గోవింద్‌ను యువతి మాదిరిగా ఆ నంబర్‌తో చాటింగ్ చేయమని సూచించారు.
తన పేరు హేమ అంటూ పరిచయం చేసుకున్న గోవింద్ ఆ మోసగాడితో చాటింగ్ చేయగా... తాను విజయ్ దేవరకొండ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని అంటూ పరిచయం చేసుకున్న అతగాడు ప్రేమ, పెళ్లి కథలే మొదలెట్టాడు. దీంతో పాటు ఆ మోసగాడు దాదాపు పది మంది యువతులను ఇలానే మోసం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మంగళవారం గోవింద్‌తో పాటు విజయ్ దేవరకొండ మేనేజర్ సైతం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment