పోలీసుల అదుపులో వంశీకృష్ణ (ఎడమ)
సాక్షి, హైదరాబాద్ : అందమైన అమ్మాయిగా, ఆగర్భ శ్రీమంతుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ సోషల్‌మీడియా ద్వారా యువతులు, మహిళలను పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న జోగాడ వంశీకృష్ణను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. ఇతడి వలలో పడిన నగర యువతి రూ.25 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన వంశీకృష్ణను పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణ పూర్తి కావడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం తిరిగి జైలుకు తరలించారు. ఇతగాడు ఇప్పటి వరకు దాదాపు 60 మంది నుంచి రూ.4 కోట్ల వరకు దండుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన వంశీకృష్ణ బీటెక్ పూర్తి చేసి 2014లో నగరానికి వలసవచ్చి రెండేళ్ల పాటు కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌లో, ట్రావెల్స్ కన్సల్టెన్సీలోనూ పని చేశాడు. క్రికెట్ బెట్టింగ్స్‌తో పాటు రేసులకు అలవాటు పడిన ఇతగాడు అందుకు కావాల్సిన డబ్బు కోసం మోసాలు చేయడం మొదలెట్టాడు. 2017లో తన గర్ల్‌ఫ్రెండ్ సుస్మితతో కలిసి పథక రచన చేసిన ఇతగాడు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. దాదాపు 40 మంది యువతుల నుంచి రూ.1.8 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై రాచకొండ కమిషనరేట్‌తో పాటు ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు, రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి.
పంథా మార్చుకుని..
♦ గడిచిన కొన్నాళ్లుగా వంశీకృష్ణ తన పంథా మార్చుకున్నాడు. యువతుల పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచాడు. వీటి ద్వారానే అనేక మంది యువతులు, మహిళలను పరిచయం చేసుకున్నాడు. వారితో కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత హర్షవర్ధన్ అనే సంపన్నుడు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నాడంటూ సమయం చూసుకుని చెప్పేవాడు. అతడి ఫోన్ నంబర్ అంటూ తనదే పంపేవాడు. దానికి కాల్ చేసిన వారితో హర్షవర్ధన్ మాదిరిగా
సంభాంచేవాడు.
♦ తన వలలో పడిన సంపన్న వర్గాలకు చెందిన యువతుల నుంచి సేవా కార్యక్రమాలు, పేదలకు ఉపాధి కలి్పంచే అంశాల పేరుతో డబ్బు దండుకునే వాడు. ఇలా దాదాపు 60 మంది నుంచి రూ.4 కోట్ల వరకు కాజేశాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఓ నగర యువతి ఇతడికి రూ.25 లక్షలు ఇచ్చి మోసపోయింది. ఆమె ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. 2016 నుంచి ఇతగాడు దాదాపు వెయ్యి మందికి పైగా మోసం చేసి ఉంటాడని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment