డేటింగ్‌ పేరుతో చీటింగ్‌ | Dating Website Cheating Girls In Hyderabad | Sakshi
Sakshi News home page

డేటింగ్‌ పేరుతో చీటింగ్‌

Published Sat, Oct 10 2020 9:15 AM | Last Updated on Sat, Oct 10 2020 10:49 AM

Dating Website Cheating Girls In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక వాణిజ్య ప్రకటనలు ఉచితంగా పొందుపరుచుకోవడానికి ఉద్దేశించిన ‘లొకంటో.కామ్‌’ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. ఈ సైట్‌ను వేదికగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు తాము టార్గెట్‌ చేసుకున్న వారిని నిలువునా ముంచుతున్నారు. ఈ నేరం వల్లోపడిన నగరానికి చెందిన ఓ డాక్టర్‌ నాలుగు నెలల్లో రూ.41.5 లక్షలు కోల్పోయాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించి శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

  • నగరంలోని పద్మారావ్‌నగర్‌కు చెందిన వ్యక్తి (57) వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల నుంచి వైద్యపట్టా పొందారు. ఆపై కేంద్ర ప్రభుత్వ సర్వీసులో వైద్యుడిగా ఎంపికై ప్రస్తుతం గుజరాత్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 
  • లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి ఈయన నగరానికే పరిమితం అయ్యారు. ఈ వైద్యుడు జూన్‌లో లొకంటో సైట్‌ను బ్రౌజ్‌ చేస్తుండగా అందులో కనిపించిన ఓ ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు.  
  • కొందరు సైబర్‌ నేరగాళ్లు ఇంటర్‌నెట్‌ నుంచి సంగ్రహించిన ఆకర్షణీయమైన యువతుల ఫొటోలు అందులో పోస్టు చేశారు. అందులో సెల్‌ నెంబర్లుకు ఇచ్చిన నేరగాళ్లు డేటింగ్‌పై ఆసక్తి ఉంటే కాల్‌ చేయాల్సిందిగా సూచించారు.  
  • ఈ ప్రకటన చూసిన వైద్యుడు వారికి కాల్‌ చేయగా..కొందరు వ్యక్తులు మాట్లాడారు. యాడ్‌లో పోస్టు చేసిన ఫొటోలు ఉన్న యువతులు డేటింగ్‌కు సిద్ధంగా ఉన్నారంటూ ఉచ్చులోకి దింపారు.  
  • వారిని కలుసుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ చేసుకుని, కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. ఇలా ఈ ఏడాది జూన్‌ 6 నుంచి ఈ వైద్యుడు ‘చెల్లింపులు’ మొదలెట్టారు.  
  • రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించిన తర్వాత కథ వాట్సాప్‌లోకి మారింది. ఇతడు ఎంచుకున్న యువతులే చాట్‌ చేస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు సీన్‌ క్రియేట్‌ చేశారు. తనను కలుసుకోవాలంటే మరికొంత మొత్తం చెల్లించాలని చెప్పించారు. 
  • ఇక అప్పటి నుంచి సీన్‌ బ్యాంకు ఖాతాలకు బదులుగా పేటీఎం, గూగుల్‌ పే వంటి ఈ–వాలెట్స్‌కు మారింది. దఫదఫాలుగా నగదు వేయించుకుంటూ వెళ్లారు. ప్రతి సందర్భంలోనూ చెల్లించిన మొత్తంలో ‘చార్జీలు’ పోను మిగిలింది రిఫండ్‌ అంటూ చెప్పారు. 
  • ఏ దశలో అయినా డబ్బు డిపాజిట్‌ చేయడం/బదిలీ చేయడం ఆపేస్తే అప్పటి వరకు చెల్లించిన మొత్తం కూడా తిరిగి రాదంటూ బెదిరించారు. దీంతో నగర వైద్యుడు డబ్బు చెల్లిస్తూ పోయాడు. ఇలా నాలుగు నెల్లో రూ.41.5 లక్షలు చెల్లించేశాడు.  
  • తనకు వచ్చే జీతంలో దాచుకున్న దానితో పాటు అప్పులు చేసి, చివరకు ప్రావిడెంట్‌ ఫండ్‌ లోన్లు తీసుకుని గత నెల ఆఖరు వరకు డబ్బు చెల్లించేశాడు. నేరగాళ్లు ఇంకా డబ్బు డిమాండ్‌ చేస్తుండటంతో ఆలోచనలో పడ్డాడు. 
  • ఈ లోపు విషయం అతడి కుటుంబీలకు తెలియడంతో వారు అప్రమత్తమై ఇంక డబ్బు చెల్లించకుండా చూశారు. శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. 
  • ఏసీపీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ నేరగాళ్లు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.  
  • లోకంటో సైట్‌ కేంద్రంగా జరుగుతున్న నేరాలను ఇటీవల పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

ఖాతాలు మార్చి రూ.2.09 కోట్ల గోల్‌మాల్‌ 
సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్‌ స్టోన్స్‌ తయారీ సంస్థ పోకర్ణ ఇంజినీరింగ్‌ స్టోన్‌ లిమిటెడ్‌ (పీఈఎస్‌ఎల్‌) సంస్థ సైబర్‌ నేరగాళ్లకు టార్గెట్‌గా మారింది. ఈ సంస్థకు చెందిన అధికారిక మెయిన్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన ‘ఈ–క్రిమినల్స్‌’ వాటిలోని ఉత్తరప్రత్యుత్తరాలను సంగ్రహించారు. వీటి ఆధారంగా నకిలీ ఇన్వాయిస్‌లు, బోగస్‌ ఈ–మెయిల్‌ ఐడీలు సృష్టించి రూ.2.09 కోట్లు గోల్‌మాల్‌ చేశారు. నాలుగు నెలల కాలంలో, మూడు దఫాల్లో జరిగిన ఈ స్కామ్‌పై దాని యజమాని గౌతమ్‌ చాంద్‌ జైన్‌ శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

  • సికింద్రాబాద్‌ కేంద్రంగా పనిచేసే పీఈఎస్‌ఎల్‌కు అంతర్జాతీయంగానూ క్లయింట్స్‌ ఉన్నారు. ఈ సంస్థ ప్రధానంగా అమెరికా, మెక్సికో, బెల్జియంలకు చెందిన కంపెనీలతో లావాదేవీలు చేస్తుంటుంది.  
  • ఈ క్రయవిక్రయాలకు సంబంధించి ఆయా కంపెనీల మధ్య ఈ–మెయిల్స్‌ రూపంలో ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ప్రతి కంపెనీ మెయిల్‌ రూపంలోనే ఇన్వాయిస్‌లను పంపి ఆ మేరకు అడ్వాన్స్‌ల్ని తీసుకుంటూ ఉంటుంది.  
  • కొందరు సైబర్‌ నేరగాళ్లు అకౌంట్‌ టేకోవర్‌ నేరానికి తెగబడ్డారు. ఇందులో భాగంగా పీఈఎస్‌ఎల్‌ సంస్థకు చెందిన అధికారిక ఈ–మెయిల్‌ అకౌంట్‌ను హ్యాకింగ్‌ చేసి అందులో ఉన్న ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలించారు.  
  • ఈ నేపథ్యంలో పీఈఎస్‌ఎల్‌కు, అమెరికా, మెక్సికో, బెల్జియం సంస్థలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి రంగంలోకి దిగిన సైబర్‌ నేరగాళ్ళు పీఈఎస్‌ఎల్‌ మెయిల్‌ ఐడీని పొందినదే మరోటి సృష్టించారు.  
  • ఇందులో కేవలం స్వల్పమార్పులు చేసి సాధారణంగా గుర్తుపట్టలేని విధంగా తయారు చేశారు. 
  • ఈ నకిలీ ఇన్వాయిస్‌లు మొత్తం యథాతధంగా ఉంచిన దుండగులు కేవలం బ్యాంకు ఖాతా వివరాలు ఉండే చోట మాత్రం అసలు వాటికి బదులుగా తమకు చెందిన ఖాతాల వివరాలు జొప్పించారు.  
  • అనివార్య కారణాల నేపథ్యంలో బ్యాంకు ఖాతా మార్చామని, ఈసారి నుంచి ఇందులోనే నగదు జమ చేయాలని ఆ మెయిల్‌లో కోరారు. నాలుగు నెలల క్రితం దీన్ని మెక్సికో, అమెరికా సంస్థలకు పంపాడు. 
  • ఈ మెయిల్‌ చూసిన ఆయా సంస్థలు నిజమని నమ్మి అడ్వాన్సులుగా 160665 డాలర్లు (రూ.1.17 కోట్ల), 56,000 డాలర్లు (40.91 లక్షలు) బదిలీ చేసేశాయి. తమ కు రావాల్సిన అడ్వాన్సుల కోసం పీఈఎస్‌ఎల్‌ సంస్థ ఆయా కంపెనీలను సంప్రదించగా విషయం తెలిసింది.
  • దీంతో తాను మోసపోయామని గుర్తించిన ఆ రెండు సంస్థలూ అమెరికా, మెక్సికోల్లోని పోలీసు విభాగాలకు ఫిర్యాదులు చేయడంతో అక్కడే కేసులు నమోదు అయ్యాయి.  
  • అంతటితో ఆగని సైబర్‌ నేరగాళ్ళు బెల్జియం సంస్థకు చెందిన అధికారిక మెయిల్‌ ఐడీని పోలినది మరోటి తయారు చేశారు. మరో నకిలీ ఇన్వాయిస్‌ను సృష్టించిన దుండగులు దీని ఆధారంగా పీఈఎస్‌ఎల్‌ సంస్థకు మెయిల్‌ పంపారు. 
  • అందులో తమకు చెల్లించాల్సిన 59,826 యూరోలు (రూ.51.59 లక్షలు) కొత్తగా తెరిచిన ఖాతాకు బదిలీ చేయాల్సిందిగా కోరారు. పీఈఎస్‌ఎల్‌ సంస్థ అలానే చేయడంతో ఆ మొత్తమూ సైబర్‌ నేరగాళ్ళకు చేరింది. 
  • ఎట్టకేలకు జరిగిన మోసాలు తెలుసుకున్న పీఈఎస్‌ఎల్‌ యాజమాని సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు ఇది నైజీరియన్లు చేసిన నేరంగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement