
హిమదాస్
లైంగికంగా వేధించాడని ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న ఓ మహిళా క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
న్యూఢిల్లీ : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించి హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే హిమదాస్ వంటి అద్బుతమైన అథ్లెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ నిపన్‌దాస్‌పై లైంగిక ఆరోపణలు రావడం సంచలనం రేపింది. తనను లైంగికంగా వేధించాడని ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న ఓ మహిళా క్రీడాకారిణి గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత మే నేలలో నిపన్ దాస్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఎంతో మంది అథ్లెట్లకు నిపన్‌దాస్ శిక్షణనిస్తున్నాడు. హిమదాస్ సైతం ఆయన శిక్షణలోనే రాటుదేలింది.
ఆ ఆరోపణలు అవాస్తవం..
ఈ ఆరోపణలను నిపన్‌దాస్ ఖండిచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి., కల్పితమైనవి. ఆమె నా దగ్గర 100మీ, 200 మీటర్ల విభాగాల్లో శిక్షణ తీసుకునేది. రాష్ట్ర జట్టులో చోటు కల్పించాలని ప్రాధేయపడేది. కానీ ఆమె కన్నా వేగంగా పరుగెత్తే వారు ఉండటంతో నేను సహకరించలేదు. జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రాష్ట్ర జట్టులో చోటు దక్కలేదు. దీంతోనే ఆమె అసత్య ఆరోపణలు చేస్తుంది. ప్రస్తుతం పోలీస్ విచారణ కొనసాగుతున్నది. నాతో పాటు సహాయక కోచ్‌లు, కొంత మంది అథ్లెట్లను విచారించారు. దర్యాప్తులో ఎలాంటి మచ్చలేకుండా బయటపడుతానన్న నమ్మకం ఉంది’ అని నిపన్ చెప్పుకొచ్చాడు.