పుత్తూరు: ఒక్కగానొక్క కూతురు జీవితం బాగుం డాలని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తరువాత తెలిసింది అతను కీచకుడని. ఆస్పత్రిలో రోగి బంధువుపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో వేరే ఆస్పత్రికి బదిలీ అయ్యాడు. అయినా బుద్ధి మారలేదు. ఈ సారి ఏకంగా పిల్లనిచ్చిన అత్తను లైంగిక వేధింపులకు గురిచేశాడు. నిర్భయ చట్టం కింద అరెస్టు అయి జైలులో ఉన్నాడు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 18 రోజులుగా జైలులో ఉన్నాడని బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా సస్పెండ్ చేయకుండా అతడిని కాపాడుతున్నారని బాధితురాలు గురువారం పుత్తూరులో విలేకరుల ఎదుట వాపోయింది. ఆమె కథనం మేరకు.. శ్రీకాళహస్త్రికి చెందిన కే.జాన్ అదే పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో అటెండెర్‌గా పని చేస్తున్నాడు. 2012లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో జాన్ వ్యవసనాలకు బానిసయ్యాడు.
భార్యను శారీరకంగా, మాససికంగా వేధింపులకు గురి చేసేవాడు. పెద్దలు సర్ది చెప్పినా అతని తీరులో మార్పు రాలేదు. 2015లో శ్రీకాళహస్త్రి ఏరియా ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన ఒక రోగి సహాయకురాలి బంధువును లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేసి జాన్‌ను సత్యవేడు ఆస్పత్రికి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ నేపథ్యంలో జాన్ వేధింపులు తాళలేక ఈ ఏడాది జనవరిలో భార్య తన ఇద్దరు కుమారులతో కలిసి చీరాలలోని పుట్టింటికి చేరింది. అప్పటి నుంచి అత్త నాగజ్యోతిని ఫోన్లో అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా లైంగిక వాంఛ తీర్చమని వేధించసాగాడు. చేసేది లేక నాగజ్యోతి చీరాల పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ఈ నెల 11వ తేదీన నిందితుడు జాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంబంధిత రిమాండు పత్రాలు, కేసు వివరాలను బాధితులు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపి జాన్‌ను సస్పెండ్ చేయమని అభ్యర్థించారు. వారు పట్టించుకోలేదు. వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అవుతుంటే పట్టించుకోకపోవడంతో పాటు రిమాండ్‌లో ఉన్నట్లు ఆధారాలు పంపినా నిందితుడి వైపే మొగ్గు చూపడంలో ఆంతర్యమేమిటని వారు నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంలో తమకు న్యాయం జరగకుండా జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి వంతపాడుతున్నారని ఆరోపించారు. నిందితున్ని సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై డీసీహెచ్‌ఎస్ సరళమ్మను వివరణ కోరగా ఈ రోజే తనకు వివరాలు అందాయని, జాన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment