
అగ్నికి ఆహుతి కాగా మిగిలిన మొండిగోడలు
తగరపువలస(భీమిలి): రెక్కాడితే గానీ డొక్కాడని కూలీల బతుకుల్లో అగ్నిప్రమాదం మంట రేపింది. ఇళ్లు, సామగ్రి, నగదు, బంగారం, సర్టిఫికెట్లతో సహా అగ్నికి ఆహుతి కావడంతో 11 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వివరాలివి..
భీమిలి మండలం అమనాం పంచాయతీ నక్కెళ్లపేటలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మందికి చెందిన 14 పూరిళ్లు, 2 పశువుల పాకలు ఆహుతయ్యాయి. మొత్తం రూ.20లక్షల ఆస్తినష్టం సంభవించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రూ.10లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్టు రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణలో తేలింది.
అంతా కూలీలే..
బాధితులలో నల్ల అప్పలనరసమ్మ, నల్ల నర్సయ్యమ్మ, ఆవాల ఎల్లమ్మ, జోగ లక్ష్మి, జోగ రాములప్పయ్యమ్మ, జోగ రమణమ్మ, ఈగల అప్పలనరసమ్మ, జోగ ఎల్లయ్యమ్మ, నల్ల బంగారప్పడు, నల్ల రామయ్యమ్మ, నల్ల సూరి అప్పయ్యమ్మ ఉన్నారు. వీరంతా ఉదయం కూలిపనులకు వెళితే సాయంత్రానికి గాని తిరిగి ఇంటికి చేరరు. ప్రమాదం జరిగిన సమయంలో వీరంతా చెరువు పనులకు, కూలిపనులకు వెళ్లిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదంలో రెండు గ్యాస్ సిలిండర్లు కాలిపోగా, మూడు గొర్రెపోతులకు కళ్లు కాలిపోయాయి. మంటలను అదుపు చేయడానికి చిట్టివలస, విజయనగరం నుంచి అగ్నిమాపక శకటాలు వచ్చినా అప్పటికే ప్రమాదం తీవ్రరూపం దాల్చింది. ప్రమాదంలో నల్ల అప్పలనరసమ్మ ఇంటి నిర్మాణం నిమిత్తం అప్పుగా తీసుకువచ్చిన రూ.5.50లక్షలు, నల్ల నరసయ్యమ్మవి రూ.10వేలు, ఈగల అప్పలనరసయ్యమ్మ రూ.60వేలు, జోగ రాములప్పయ్యమ్మ రూ.80వేలు నగదు కాలి బూడిదయ్యాయి. బాధితులకు సర్పంచ్ దంతులూరి ఉమాదేవి, వాసురాజు భోజనాలు, వసతి ఏర్పాటు చేశారు. తహసీల్దార్ పి.వి.ఎల్. గంగాధరరావు, ఆర్‌ఐ రామకృష్ణ, వీఆర్వో సుబ్రహ్మణ్యం పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment