
ఆపద్బంధుకు ఆపద
సాక్షి, మహబూబ్‌నగర్: ఆపద్బంధు పథకానికి ఆపదొచ్చింది. వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలను ఆపత్కాలంలో ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆపద్భంధు పథకం ఆగిపోతోంది. ఇంతో ఆర్థికంగా ఆదుకుంటుందని ఆశగా దరఖాస్తు చేసుకుంటే నెలలు గడుస్తున్నా సర్కారు నుంచి ఒక్క పైసా రావడం లేదు.
కుటుంబ సభ్యుడు చనిపోయిన బాధ ఒకవైపు ఉంటే ప్రభుత్వ తీరుతో బాధిత కు టుంబాలు మరింత కుంగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, విద్యుదాఘాతం, అగ్ని ప్రమాదాలు, వడదెబ్బ మృతులు, ఇతర ప్రమాదాలబారిన పడి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆపద్బంధు పథకం కింద రూ.50వేల వరకు ఆర్థిక సాయం అందుతుంది. నిబంధనల ప్రకారం అయితే మరణించిన వ్యక్తి కుటుంబాలకు తక్షణమే ఈ పథకం కింద ఆర్థికసాయం అందించాలి. కానీ అధికారులు అలసత్వం, రకరకాల కొర్రీల కారణంగా నెలల తరబడి వేచియున్నా ఫలితం కనిపించడం లేదు.
తగ్గిన ఆదరణ...
ఆపద్బంధు పథకానికి రోజు రోజుకు ఆదరణ తగ్గిపోతుంది. ప్రభుత్వ వైఖరి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏడాదీ వీటి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే... అధికారులు సవాలక్ష కొర్రీలు విధిస్తున్నారని బాధిత కుటుంబాలు నిట్టూరుస్తున్నాయి.
ఎఫ్‌ఐఆర్, పోస్టుమార్టం కాపీ, ఇన్‌క్వెస్టు రిపోర్టు, చార్జీషీట్, ఎఫ్‌ఎస్‌ఎల్, డ్రౌనింగ్ వంటి రిపోర్టులు కావాలని, అవన్నీ నాలుగు సెట్ల కాపీలను జతపర్చాలంటారు. ఒక కాపీ ఎమ్మార్వో, మరో కాపీ ఆర్డీఓ, మరోకటి కలెక్టరేట్, ఇంకొకటి ఇన్సూరెన్స్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. దీంతో దరఖాస్తుదారులు విసిగి వేసారిపోతున్నారు. దీంతో ప్రతి ఏటా ఆపద్బంధు దరఖాస్తుల సంఖ్య తగ్గిపోతుంది. 2012లో 341 దరఖాస్తులు రాగా... 2013కు ఆ సంఖ్య 253కు పడిపోయింది. ఇక 2014 నాటికి ఆ సంఖ్య మరీ దారుణంగా 111కు మాత్రమే పరిమితమైంది.
చేయూత లేక వలస పాయే
దేవరకద్ర రైల్వే స్టేషన్ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని వడ్డె మల్లేశ్, దుర్గమ్మలు ఉండేవారు. మూడు నెలల క్రితం గోపన్‌పల్లి వద్ద జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మల్లేశ్ మరణించాడు. ఆపద్బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి చేయూత లభించలేదు. ట్రాక్టర్ ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పిన రాలేదు. దిక్కులేని పరిస్తితుల్లో దుర్గమ్మ తమ కొడుకులు కృష్ణ(8), పురుషోత్తం(6), మణికంఠ(4), గణేశ్(2)తో వెంటపెట్టుకొని హైదరాబాద్ వలస వెళ్లింది.
- వడ్డే దుర్గమ్మ, దేవరకద్ర
పోషించే దిక్కు లేక పాయే
జీవితాంతం తోడుంటే భర్త రోడ్డు ప్రమాదంలో బలయ్యాడు. మమ్ములను అనాథలను చేశాడు. నాకు, నా కూతురికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. మేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త తిమ్మారెడ్డి మృతిచెందాడు. జూన్‌లో ఆపద్భందు పథకం ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తూ చేసుకున్నా. ఇప్పటి దాకా మాకెలాంటి సాయమూ అందలేదు. దీని గురించి పట్టించుకునే వారే లేరు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా పాయిదా లేదు. తిరిగి, తిరిగి వేసారిపోయినం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. - విజయలక్ష్మి, గట్టు