
తాడేపల్లిరూరల్: తన కోరిక తీర్చలేదని భార్యపై కత్తిపీటతో దాడిచేసి గాయపరిచాడో భర్త. అయితే తన భర్తను వెంటనే విడుదల చేయాలని పోలీసులకే అల్టిమేటం ఇచ్చింది ఆ ఇల్లాలు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వడ్డేశ్వరం గ్రామంలో నివసించే ఓ వ్యక్తి (40) తన కోరిక తీర్చలేదనే కోపంతో భార్యపై కత్తిపీటతో దాడిచేశాడు. ఈ ఘటనలో ఆమెకు వీపు కింద భాగంలో తీవ్రమైన గాయమైంది. విపరీతంగా రక్తస్రావం జరగడంతో స్పృహ కోల్పోయింది. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బంధువులు క్షతగాత్రురాలిని వైద్యం కోసం గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. గాయమైన చోట 15 కుట్లు వేశారు. ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. అయితే వైద్యుల సూచనలను పక్కన పెట్టిన ఆమె.. తన భర్తను పోలీసులు అరెస్టు చేశారని, వెంటనే ఆయన్ను విడిపించాలంటూ గ్రామానికి తిరిగి వచ్చేసింది. తన భర్తను విడిచిపెట్టాలని, తాను ఎలాంటి ఫిర్యాదూ చేయడం లేదని తాడేపల్లి పోలీసులను కోరింది. పోలీసులు మాత్రం నిందితుడిని అదుపులోనే ఉంచుకున్నారు. సాయంత్రం మరోసారి సదరు మహిళ పోలీసులకు ఫోన్ చేసి.. తన భర్తను విడిచిపెట్టకపోతే ఆయనకు ఏం జరిగినా మీరే బాధ్యులంటూ హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. భార్యాభర్తలన్న తర్వాత గొడవలు జరగకుండా ఎలా ఉంటాయి? కేసు పెట్టి మా పరువు తీసుకోమంటారా? అలాగైతే మేము మీపైనే ఫిర్యాదు చేస్తాం అంటూ ఆమె పోలీసులను హెచ్చరించినట్లు సమాచారం. దీంతో విస్తుపోయిన పోలీసులు ఏ నిర్ణయమూ తీసుకోవాలో అర్థంగాక సతమతమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment