హత్యకు గురైన సవర చొంప
సాక్షి, మందస (శ్రీకాకుళం): కొండపైకి కట్టెల కోసం భార్యాభర్తలు వెళ్లారు. అక్కడ ఏమైందో.. ఏమో భార్య హతురాలయ్యింది. పరారైన భర్తను పట్టుకుని గ్రామస్తులు నిలదీయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రశాంతంగా ఉండే గిరిజన ప్రాంతంలో సంచలనమైంది. మందస మండలం చీపి పంచాయతీ సవరరాజపురం గ్రామానికి చెందిన సవర లింగరాజు, చొంప శుక్రవారం సాయంత్రం సమీపంలోని కొండపైకి వంట చెరుకు కోసం వెళ్లారు. రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో పిల్లలకు గ్రామస్తుల దృష్టికి తీసుకొచ్చారు. శనివారం ఉదయం నుంచి లింగరాజు, చొంప దంపతుల ఆచూకీ కోసం వెతకగా, సాబకోట పంచాయతీ సమీప ఒడిశా రాష్ట్రంలోని చొంపాపురం గ్రామంలో లింగరాజును గుర్తించారు.
ఈ మేరకు గ్రామానికి తీసుకువచ్చి చొంప ఏమైందని ప్రశ్నించినా లింగరాజు నుంచి సమాధానం లేదు. చివరకు గ్రామస్తులు బలవంతం చేయడంతో కట్టెలకు కొండపైకి వెళ్లినట్లు చెప్పాడు. దీంతో గ్రామ గిరిజనులు ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా విగతజీవిగా ఆమె పడి ఉంది. కొండపై కర్రలకు వెళ్లిన భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదం రావడంతో అప్పటికే మద్యం సేవించిన లింగరాజు కత్తితో భార్య తలపై నరకడంతో అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. ఈయన భయంతో ఒడిశా ప్రాంతం వైపు పరారయ్యాడు. గ్రామస్తులు లింగరాజును పట్టుకోవడంతో హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలికి కుమార్తె రుక్మిణి(10), కుమారుడు బాలరాజు(3) ఉన్నారు. తల్లి మృతితో వీరు బోరున విలపించారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
సవరరాజపురంలో హత్య సంఘటనా స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ బర్ల ప్రసాదరావు, సోంపేట సీఐ ఎం తిరుపతిరావు, మందస ఎస్‌ఐ వీ నాగరాజు పరిశీలించారు. మృతదేహాన్ని బారువ ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేయగా, సీఐ తిరుపతిరావు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment