అత్తింటి వేధింపులకు ఐదు నెలల గర్భిణి బలి | Suspicious Death Of Women In Santhabommali Mandal Srikakulam | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులకు ఐదు నెలల గర్భిణి బలి

Published Wed, Nov 27 2019 8:26 AM | Last Updated on Wed, Nov 27 2019 1:09 PM

Suspicious Death Of Women In Santhabommali Mandal Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : పెళ్లయిన ఐదు నెలలకే గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి మండలం నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లి, బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటకు చెందిన పాల రామిరెడ్డితో పోతునాయుడుపేటకు చెందిన ఆబోతు లావణ్య(21)కు ఈ ఏడాది జూన్‌ 13న వివాహం జరిగింది. రామిరెడ్డి తండ్రి చిన్నప్పడే చనిపోవడంతో తల్లి పాల బోడెమ్మతో కలిసి కొన్ని రోజులు సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత అత్త, కోడలి మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలు ప్రారంభమయ్యాయి.

కొద్దిరోజుల అనంతరం భర్త రామిరెడ్డి ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌ ఉద్యోగ నిమిత్తం కరీంనగర్‌కు వెళ్లిపోయాడు. ఈ సమయంలో అత్త బోడెమ్మ వేధింపులు ఎక్కువ కావడం, భర్త రామిరెడ్డికి ఫోన్‌లో చెప్పినా పట్టించుకోకపోవడంతో లావణ్య నెల్లూరులో కూలి పని చేసుకుంటున్న తన తల్లి శార్వాణికి జరిగిన విషయం ఫోన్‌లో చెప్పింది. వెంటనే ఆమె అల్లుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పగా తల్లికే సపోర్టు చేసి మాట్లాడటంతో చేసేదేమీ లేక మౌనం దాల్చింది. ఇది జరిగిన రెండు రోజులకే లావణ్య మృతి చెందడంతో తల్లి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

అసలేం జరిగింది..? 
బోడెమ్మ, కోడలు లావణ్య మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో లావణ్య తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అత్త స్థానికంగా ఉన్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ పి.శ్రీనును తీసుకొచ్చి బలవంతం తలుపులు తెరిపించింది. అప్పటికే లావణ్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటంతో ఆర్‌ఎంపీ డాక్టర్‌కు ఫోన్‌ చేసింది. ఆయన వచ్చే సరికే బోడెమ్మ తన కోడలిని కిందకు దించి వరండాలో ఉంచి కుమారుడికి ఫోన్‌ ద్వారా విషయం చెప్పింది. అనంతరం నెల్లూరులో ఉన్న శార్వాణికి సమాచారం అందించారు.

ఆమె స్వగ్రామంలో ఉన్న బంధువులకు ఫోన్‌ ద్వారా విషయం చెప్పగా వారు నౌపడ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్‌ఐ మధుసూదనరావు  సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేశారు. మంగళవారం తహసీల్దార్‌ పి.సోమేశ్వరరావు, సీఐ నీలయ్య సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి ఆబోతు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు లావణ్య అత్త పాల బోడెమ్మ, భర్త పాల రామిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అత్త, భర్తల వేధింపులు తాళలేకే లావణ్య ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ  తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement