హతురాలు రూప(ఫైల్) ,రూప మృతదేహం
చిత్తూరు, రేణిగుంట : అగ్ని సాక్షిగా జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లినాటి ప్రమాణాలను గాలికొదిలేశాడు. తిరుమల వెంకన్న దర్శనం కోసం అని మాయమాటలు చెప్పి భార్యను కిరాతకంగా కడతేర్చాడు. గురువారం ఈ సంఘటన రేణిగుంట మండలంలో వెలుగుచూసింది. గాజులమండ్యం సీఐ అమరనాథరెడ్డి కథనం... గాజులమండ్యంకు చెందిన రుక్మానందరాజు కుమార్తె రూప(26)కు విప్పమానుపట్టెడకు చెందిన మునిశంకర్(30)తో 2014లో వివాహమైంది. వీరికి నిఖిత(4) కుమార్తె ఉంది. మునిశంకర్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వివాహమైన కొంత కాలానికే మునిశంకర్ తాగొచ్చి భార్యతో గొడవ పడుతూ తరచూ కొట్టి హింసించేవాడు. ఈ నేపథ్యంలో తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలని భార్యను నమ్మించాడు, చిన్నారి నిఖితను గాజులమండ్యంలోని అమ్మమ్మ ఇంటి వద్ద దింపి అక్కడ నుంచి బుధవారం ఉదయం దంపతులిద్దరూ తిరుమలకు ఇంటి నుంచి వ్యానులో బయల్దేరారు.
అయితే సాయంత్రానికి పూటుగా మద్యం సేవించి మునిశంకర్ ఒక్కడే విప్పమానుపట్టెడకు చేరుకుని కాసేపటికే పరారయ్యాడు. అయితే గురువారం ఉదయం మండలంలోని తూకివాకం–విప్పమానుపట్టెడ మార్గంలోని ఓ ప్రైవేటు వెంచర్ సమీపంలో వివాహిత మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు సమాచారం చేరవేయడంతో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అమరనాథరెడ్డి, ఎస్‌ఐ స్వాతి, తహసీల్దార్ విజయసింహారెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇనుపరాడ్‌తో తలపై బలంగా మోది వివాహితను హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. ఘటన స్థలంలో రక్తపు మరకలు అంటిన ఇనుప రాడ్ పడి ఉండడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. హతురాలు రూప అని నిర్థారించుకున్న పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న మృతురాలి బంధువులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రూపను ఆమె భర్తే హత్య చేసి పరారైనట్లు గ్రహించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా తండ్రి చేతిలో తల్లి దారుణ హత్యకు గురవడంతో చిన్నారి నిఖిత అనాథగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment