
చిత్తూరు, తంబళ్లపల్లె: ఓ వివాహిత హత్యకు గురైన సంఘటన సోమవారం మండలంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం..మండలంలోని రేణుమాకులపల్లె పంచాయతీ దండువారిపల్లెకు చెందిన విశ్వనాథ్(34)కు పలమనేరు నియోజకవర్గంలోని ధర్మపురికి చెందిన వాణి(30)తో వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమార్తె హేమలత ఉంది. ప్రస్తుతం వాణి ఆరు మాసాల గర్భవతి. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.
వీటిమూలాన గొడవపడేవారు. ఈ నేపథ్యంలో దంపతులిద్దరూ ఆదివారం ఆ గ్రామానికి సమీపంలోని పొలాల్లోకి పాడి ఆవులను మేపేందుకు వెళ్లారు. వారు రాత్రి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్థానికులు పలుచోట్ల వెతికారు. సోమవారం ఉదయం ఆ గ్రామ సమీపంలోని కన్నెమడుగోళ్ల పొలాల ప్రాంతంలో వాణి హత్యకు గురై పడి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు. వాణి మెడపై కత్తితో నరకడంతో ఆమె మృతి చెందిన ఆనవాళ్లు ఉండటం, మరోవైపు భర్త పరారీలో ఉండడంతో అతనే ఈ దురాగతానికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ములకలచెరువు సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ శివకుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. హత్యకు దారితీసిన కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment