
శిల్ప, రాజ్‌కుమార్(ఫైల్)
సాక్షి, దుండిగల్: ఓ వ్యక్తి సుత్తితో తలపై మోది భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా, మన్నెపల్లి గ్రామానికి చెందిన బస్వరాజు రాజ్‌కుమార్, శిల్ప(38) దంపతులు. 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాజ్‌కుమార్ ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పని చేస్తుండగా శిల్ప గృహిణి. వారికి శివానీ, పవన్ సంతానం. శివానీకి డీపోచంపల్లికి చెందిన హరీష్‌తో వివాహం కాగా, పవన్ సూరారంలోని ఓ ప్రైవేట్ పాఠశాలో 10వ తరగతి చదువుతున్నాడు.
కుమారుడికి స్కూల్ దూరంగా ఉండడంతో నెల రోజుల క్రితం రాజ్‌కుమార్ భవానీ నగర్‌కు మకాం మార్చాడు. సోమవారం రాత్రి పవన్ రోడా మేస్త్రీనగర్‌లోని తన బావ దుకాణానికి వెళ్లి అక్కడే పడుకున్నాడు. అదే రోజు రాత్రి శిల్ప, రాజ్‌కుమార్ మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి లోనైన రాజ్‌కుమార్ సుత్తితో శిల్ప తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లి పోయిన రాజ్‌కుమార్ మంగళవారం ఉదయం హరీష్‌కు ఫోన్ చేసి ‘ మీ అత్తకు నాకు చిన్న గొడవ జరిగింది.. ఆమెను కొట్టాను, బతికి ఉందో.. చనిపోయిందో.. వెళ్లి చూడని’ చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో హరీష్ తన భార్య శివానీతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా శిల్ప అప్పటికే మృతి చెందింది. హరీష్ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment