స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ,నిందితులు, (ఇన్‌సెట్లో)
సాక్షి, సిటీబ్యూరో: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆన్‌లైన్ స్కాలర్‌షిప్ ఫర్మ్ డైరెక్టర్, గ్రాఫిక్ డిజైనర్, టెక్కీ, ఈవెంట్ మేనేజర్, హెచ్‌ఆర్ ప్రొఫెషనల్, జాబ్ కన్సల్టెంట్, కృషి భవన్ ఉద్యోగులు... ఇలా ఎనిమిది మందితో ఏర్పడిన ముఠా.. నవరత్నాలుగా పిలిచే ఓఎన్‌జీసీ, గెయిల్, ఐఓసీ... వంటి సంస్థల్లో ఉద్యోగాల పేరుతో వల వేసింది. ఆసక్తి చూపిన వారికి ఏకంగా ఢిల్లీలోని ‘అధికారిక ప్రాంతమైన’ కృషి భవన్‌లో ఇంటర్వ్యూలు చేసింది. స్పూఫ్డ్ మెయిల్స్‌తో ఆఫర్ లెటర్స్ ఇచ్చి రూ.కోట్లలో దండుకుంది. ఈ అంతర్రాష్ట్ర ముఠా చేతిలో మోసపోయిన వారిలో హైదరాబాద్‌కు చెందిన వారూ ఉన్నారు. ఈ గ్యాంగ్‌లో ఐదుగురితో పాటు కృషిభవన్ ఉద్యోగులైన ఇద్దరిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు ఓ హైదరాబాదీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జాబ్ కన్సల్టెంట్ అయిన ఇతడు స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్లు చెప్తున్నారు.
వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చి...
ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన కిషోర్ కునాల్ (ఫర్మ్ డైరెక్టర్), జగదీష్, సందీప్ (కృషి భవన్ ఉద్యోగులు), వశీం (గ్రాఫిక్ డిజైనర్), అంకిత్ (ఈవెంట్ మేనేజర్), విశాల్ (సాఫ్ట్‌వేర్ ఇంజినీర్), సుమన్ (హెచ్‌ఆర్ ప్రొఫెషనల్)తో పాటు హైదరాబాద్‌కు చెందిన జాబ్ కన్సల్టెంట్ రవిచంద్ర ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి కేంద్రం ఆధీనంలో ఉండే నవరత్నాలుగా పరిగణించే ఓఎన్‌జీసీ, గెయిల్, ఐఓసీ వంటి సంస్థల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు తెరలేపారు. దీనికోసం వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడంతో పాటు వ్యక్తిగతంగానూ అనేక మంది నిరుద్యోగుల్ని ఆకర్షించారు. దరఖాస్తు చేసిన వారికి ఇంటర్వ్యూ లేఖలను మెయిల్ చేయడంతో పాటు ఫోన్‌కాల్స్ చేశారు. దీనికోసం వీరు ఢిల్లీలో ఉన్న కృషి భవన్‌ను వినియోగించుకున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ భవన్‌లోనే అనేక కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ పని చేసే నాలుగో తరగతి ఉద్యోగుల ద్వారా అధికారులు లేని సమయంలో లోపలకు వెళ్లి ఫోన్ కాల్స్ చేసేదీ ముఠా. రవిచంద్ర హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగుల్ని ఆకర్షించి ఈ ముఠాకు పరిచయం చేసేవాడు. దీనికోసం ఇతడికి భారీ మొత్తంలో కమీషన్ ముడుతుండటంతో తనకు ఉన్న పరిచయాలతో ఇతర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకూ టోకరా వేశాడు.
ఇంటర్వ్యూలు సైతం కృషి భవన్‌లోనే...
ఒక్కో ఉద్యోగానికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రేటు చెప్పే ఈ గ్యాంగ్ ఉద్యోగార్థుల నుంచి ప్రాథమికంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకునేది. దీనికోసం కృషి భవన్ నుంచి ఫోన్‌కాల్స్ చేసి నమ్మించేది. ఆపై ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలంటూ కాల్ లెటర్స్ పంపేది. గతంలో ఈ ముఠా అక్కడి స్టార్ హోటల్స్‌లోని గదుల్లో ఇంటర్వ్యూలు చేసింది. అయితే నిరుద్యోగుల్ని పూర్తిగా నమ్మించడానికి తమ పంథా మార్చింది. కృషి భవన్‌లోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు చేసే జగదీష్, సందీప్‌లకు అందులోని ఏ ప్రాంతానికైనా యాక్సస్ ఉండేది. దీన్ని దుర్వినియోగం చేసిన వారు ముఠా సభ్యుల్ని భవన్ లోపలకు తీసుకువెళ్లే వారు. ఆ రోజు ఏ అధికారి సెలవులో ఉంటే ఆ కార్యాలయాన్ని వీరికి అప్పగించే వారు. నిరుద్యోగుల్ని అక్కడకు పిలిపించే ముఠా సభ్యులు ఆ కార్యాలయాల్లోనే ఇంటర్వ్యూలు చేసే వారు. దీంతో ఉద్యోగార్థులు పూర్తిగా ముఠా వలలో పడిపోయేవారు. ఈ ఇంటర్వ్యూలు చేసే వ్యవహారాల్లోనూ రవిచంద్ర పాత్ర కీలకంగా ఉండేదని పోలీసులు అనుమానిస్తున్నారు.
స్పూఫింగ్ మెయిల్స్, ఫోన్‌కాల్స్...
నిర్ణీత రుసుం తీసుకుని స్పూఫింగ్ సాఫ్ట్‌వేర్, సదుపాయాన్ని అందించే వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇది ఇంటర్‌నెట్ ద్వారా చేసే కాల్. దీనిలోకి ఎంటర్ అయిన తరవాత సదరు వ్యక్తి ఫోన్ నెంబర్‌తో పాటు ఫోన్‌కాల్‌ను అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్ రిసీవ్ చేసుకునేప్పుడు ఇతడికి సెల్‌ఫోన్‌లో ఎవరి నెంబర్ డిస్‌ప్లే కావాలో అది కూడా పొందుపరుస్తారు. ఇదేరకంగా ఈ–మెయిల్ ఐడీ స్పూఫింగ్ వెబ్‌సైట్లలో మెయిల్ ఐడీలను రిజిస్టర్ చేస్తారు. ఇ లా చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీ నుంచి కాల్ చేసినట్లు, ఈ–మెయిల్ పంపినట్లు మరో వ్యక్తిని బుట్టలో వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్పూఫింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఎడాపెడా వినియోగించేస్తున్న మోసగాళ్లు నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల పేరుతో టోకరా వేశారు. ఈ అంతర్రాష్ట్ర గ్యాంగ్ స్పూఫింగ్ ద్వారా ఓఎన్‌జీసీ నుంచి ఫోన్‌కాల్స్, ఈ–మెయిల్స్ వచ్చినట్లు సృష్టించారు. ఇంటరŠూయ్వలు పూర్తయిన వారికి ఇలానే నియామక కబురు అందించి మిగిలిన మొత్తం డిమాండ్ చేశారు. తమకు ఓఎన్‌జీసీ నుంచే లేఖ/కాల్ వచ్చిందని నమ్మిన నిరుద్యోగులు మిగిలిన మొత్తం ఆ ముఠాకు చెల్లించేసేవారు.
వ్యవహారం వెలుగులోకి వచ్చిందిలా...
కొన్నాళ్లుగా ఈ పంథాలో మోసాలు చేస్తున్న ఈ ముఠాపై తొలిసారిగా రెండు నెలల క్రితం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది. హైదరాబాద్, ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులకు ఈ ముఠా ఓఎన్‌జీసీలో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలంటూ ఎర వేసింది. ఇంటర్వ్యూల వరకు పూర్తి చేసి వీరి నుంచి రూ.22 లక్షలు తీసుకుంది. ఆపై బోగస్ లేఖలు అందించింది. వీటిని పట్టుకున్న నిరుద్యోగులు ఓఎన్‌జీసీ కార్యాలయానికి వెళ్లారు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు అక్కడి వసంత్‌కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన ఈ స్పెషల్ టీమ్ సోమ వారం కిషోర్ కునాల్, జగదీష్, సందీప్, వశీం, అంకిత్, విశాల్, సుమన్‌లను అరెస్టు చేసింది. వీరి నుంచి 27 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్స్, 10 చెక్ బుక్స్, నకిలీ గుర్తింపుకార్డులు, 45 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకుంది. వీరి విచారణ నేపథ్యంలోనే రవిచంద్ర పాత్ర వెలుగులోకి రావడంతో వేట ము మ్మరం చేసింది. ఇతడిని పట్టుకోవడం కోసం ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్‌లోనూ గాలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment