సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్‌ల పేరుతో అమాయకులకు గాలం వేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. నైజీరియా, ఘనా తదితర దేశాలకు చెందిన ఎక్‌పాల్‌గడ్‌స్టీమ్, అడ్జల్, కిక్కి కాన్ఫిడెన్స్ దావిద్, పి. క్రోమవోయిబో, ఎజిటర్ డానియల్ కొంత కాలంగా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చారు. ఢిల్లీలో మకాం వేసిన వీరు ‘డింగ్ టోన్’ యాప్ ద్వారా అబ్బాయిలతో అమ్మాయిలాగా, అమ్మాయితో అబ్బాయిలాగా చాటింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన యువకుడికి సోఫియా అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు మీ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నామని మెసేజ్ పంపారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో లాండ్ అయ్యానని, తన వద్ద 75 వేల విదేశీ కరెన్సీ, గోల్డ్ చైన్, మొబైల్ ఫోన్లు తదితర విలువైన వస్తువులు ఉన్నాయని, వాటికి సంబందించి కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని చెబుతూ బాధితుడితో డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని మల్కాజిగిరి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు సీపీ తెలిపారు. నిందితుల ఆటకట్టించిన రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ యాదగిరి, అడిషనల్ క్రైమ్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్‌లను సీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment