మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్
సాక్షి, సిటీబ్యూరో: ‘ఆమె’ కోసం అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి.. సైబర్ నేరంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడిన పాకిస్థాన్ జాతీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ కేసులో అధికారులు పాక్ రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఇక్రమ్‌కు ఆ దేశం జారీ చేసిన పాస్‌పోర్ట్, దాని ఆధారంగా తీసుకున్న వీసాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. గత వారం ఢిల్లీ వెళ్ళిన ప్రత్యేక బృందం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఈ లేఖను పంపారు. దీనికి స్పందించి.. పాకిస్థాన్ ఇచ్చే సమాధానంపైనే కేసుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలని అధికారులు నిర్ణయించారు.
భారతీయుడిగా నమ్మించి వివాహం..
నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. పదేళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ మహిళకు పాకిస్థానీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన సదరు మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. 2011లో ఇక్రమ్ సైతం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ చెప్పాడు. వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చిన అతగాడు అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్ళి అట్నుంచి హైదరాబాద్ వచ్చాడు.
‘కూతురినే’ వేధించి కటకటాల్లోకి..
ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షకట్టిన అతగాడు ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు తీయడంతో పాటు కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించానంటూ ఆమెను బెదిరించాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. గత నెల్లో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్ పాస్‌పోర్ట్ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది. సర్టిఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసినట్లు బయటపడింది.
నిర్ధారించాలంటే ‘ధ్రువీకరించాల్సిందే’..
ఇతగాడి అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్లు సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపుకార్డులతో పాటు పాక్ పాస్‌పోర్ట్‌కు చెందిందిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్స్ ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడి వద్ద ఉన్న సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005–08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. ఇవి తప్పని తేలాలంటే ఆ సమయంలో ఇక్రమ్ భారత్‌తో లేనట్లు నిర్ధారించాల్సి ఉంది. వాస్తవానికి ఇక్రమ్ 2009 వరకు పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని పాక్ «ధ్రువీకరిస్తేనే బోగస్ వ్యవహారం నిర్థారణ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఎంఈఏ ద్వారా లేఖ రాశా రు. ఇప్పుడు ఇక్రమ్ తమ పౌరుడు కాదంటూ పాక్ జవాబు ఇస్తే.. అసలు ఈ కేసు నిలబడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సమాధానం వచ్చిన తర్వాతే కేసులో ఎలా ముందుకు వెళ్లాలనేది నిర్ణయించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment