షికాగో నగరంలో వెస్ట్‌బెల్డెన్ అవెన్యూ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్
సాక్షి, హైదరాబాద్ : ఆమె ఓ చిన్నస్థాయి సినీ నటి.. ఇటీవలే తాత్కాలిక వీసాపై అమెరికాలోని షికాగో విమానాశ్రయానికి చేరింది.. అక్కడి కస్టమ్స్ అధికారులు ప్రశ్నించగా.. ఓ భారత అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన మేనేజర్ సాయంతో వచ్చానని, రెండు వారాలు ఉండి వెళ్లిపో తానని చెప్పింది.. కానీ ఆమెను రప్పించింది వ్యభి చారం చేయించడానికి.. ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికంటూ టాలీవుడ్ నుంచి చిన్నస్థాయి సినీతారలను అమెరికాకు రప్పించి, భారీగా డబ్బు ఎరగా చూపి వ్యభిచారం చేయిస్తున్న కిషన్ మోదుగుమూడి, చంద్ర అనే భారతీయ దంపతులను అక్కడి షికాగో ఫెడరల్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేసి, అక్కడి జిల్లా కోర్టుకు 42 పేజీలతో కూడిన దర్యాప్తు నివేదికను సమర్పించారు. కిషన్ మోదుగుమూడి పలు తెలుగు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. ఈ వ్యవహారంపై అక్కడి ‘షికాగో ట్రిబ్యూన్’ మీడియా సంస్థ పూర్తి వివరాలతో కథనం ప్రచురించడం సంచలనం సృష్టిస్తోంది. షికాగో ట్రిబ్యూన్ కథనం ప్రకారం..
తాత్కాలిక వీసాలపై రప్పించి..
భారతీయ అసోసియేషన్ల కార్యక్రమాల్లో పాల్గొనడానికంటూ కిషన్ దంపతులు కొందరు చిన్నస్థాయి సినీ తారలను అమెరికాకు రప్పించి, వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. అవకాశాలు పెద్దగా లేని, ద్వితీయస్థాయి నటీమణులకు భారీగా డబ్బు ఎరగా చూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. హీరోయిన్లు అనగానే అమెరికాలో ఉన్న భారతీయులకు ఉండే ‘మక్కువ’ను సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాగే ఇటీవల ఓ నటిని అమెరికాకు రప్పించినప్పుడు సందేహం వచ్చిన ఫెడరల్ పోలీసులు కూపీ లాగారు. దీంతో షికాగో నగరంలో వెస్ట్‌బెల్డెన్ అవెన్యూ ప్రాంతంలోని 5700 నంబర్ అపార్ట్‌మెంట్‌లో కిషన్ దంపతులు నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. దీనిపై దర్యాప్తు చేసిన ఫెడరల్ పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. నటీమణులకు డబ్బులు ఎరవేసి ఆ అపార్ట్‌మెంట్‌లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని.. ఈ వ్యవహారంలో బాలికలు, మహిళల అక్రమ రవాణా అంశాలూ ఇమిడి ఉన్నాయంటూ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు.
చంపుతామని బెదిరించి..
అవకాశాలు రాని చిన్న నటీమణులు, హీరోయిన్లకు కిషన్ దంపతులు డబ్బు ఎరవేసి వ్యభిచారంలోకి దింపుతున్నారని... తర్వాత వారిని బెదిరిస్తున్నారని ఫెడరల్ పోలీసులు కోర్టుకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ విధంగా ఓ నటిని లోబర్చుకున్నారని, తమ గురించి బయటపెడితే కీడు తలపెడతామంటూ హెచ్చరించారని తెలిపారు. కిషన్ భార్య చంద్ర ఈ వ్యభిచార కార్యకలాపాల వివరాలను, ఎవరెవరితో ‘వ్యాపారం’చేశారు, ఎంత సొమ్ము వచ్చింది.. వంటివాటిని రాసిపెట్టుకుందని వెల్లడించారు. కిషన్ అపార్ట్‌మెంట్‌లో జరిపిన సోదాల్లో జిప్‌లాక్ కవర్లలో ఉంచిన 70కి పైగా కండోమ్‌లు లభించాయని వివరించారు.
ఈ–మెయిళ్లు.. ఫోన్లలో బేరాలు
కిషన్ దంపతులు అటు బాధితులు, ఇటు విటులతో ఈ–మెయిళ్లలో, ఫోన్లలో సంప్రదింపులు జరిపారని.. కిషన్ భార్య చంద్ర నేరుగా విటులతో ఫోన్‌లో మాట్లాడేదని ఫెడరల్ పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఫోన్‌ను పరిశీలించిన విచారణ అధికారులు.. ఆమె విటులతో జరిపిన ఎస్సెమ్మెస్ సంప్రదింపులను గుర్తించారు. ‘ఏ నటి అందుబాటులో ఉంది, ఎంత చెల్లించాల్సి ఉంటుంది’వంటి వివరాలతోపాటు వ్యభిచారానికి సిద్ధంగా ఉన్న నటి ఫోటోలను కూడా పంపింది. ‘ఓ నటి ఫోటోను ఒక క్లయింట్‌కు పంపగా.. అతను నా కోసమేనా? అంటూ సంతోషం వ్యక్తం చేసినట్టు’గా 2016 డిసెంబర్‌లో పంపిన మెసేజ్‌లో ఉంది. ఇక ‘తాను ఇప్పుడే ఓ క్లయింట్‌తో వ్యభిచరించానని, అతను చాలా సంతృప్తిగా ఉన్నాడ’ని ఓ బాధితురాలు చంద్రకు పంపిన మెసేజీలు కూడా లభించాయని ఫెడరల్ పోలీసులు పేర్కొన్నారు. కిషన్ దంపతులు అమెరికాలోని భారతీయ సంఘాల సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల వద్దకు వెళ్లి ఇలాంటి వ్యవహారాలపై ఆసక్తి ఉన్న వారి వివరాలను తెలుసుకునేవారని.. వ్యభిచారం కోసం ఒక్కో విటుడి నుంచి 3 వేల డాలర్ల వరకు వసూలు చేశారని తేలిందని నివేదికలో వెల్లడించారు.
‘ప్లీజ్.. నన్ను ఆ కూపంలోకి లాగొద్దు’
కిషన్ ఈ–మెయిళ్లను పరిశీలించిన షికాగో పోలీసులకు ఓ బాధిత మహిళ పంపిన ఈ–మెయిళ్లు లభించాయి. తనను బెదిరించవద్దని, వ్యభిచారం చేయాలని వేధించవద్దని ఆమె కిషన్‌కు మెయిళ్లు పంపింది. ‘నాకు ఇలాంటివి చేయాలనిపించడం లేదు. ఇప్పుడుగానీ, భవిష్యత్తులోగానీ నీతో కలసి నేను అలాంటి పనులు చేయలేను. ఇంకోసారి నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తా..’’అని ఆమె ఆ మెయిళ్లలో హెచ్చరించింది.
భార్యాభర్తలు అరెస్ట్.. రిమాండ్
డబ్బు ఎరవేసి వ్యభిచారం చేయించిన అంశంపై కిషన్ దంపతులను అమెరికా ఫెడరల్ పోలీసులు ఏప్రిల్ చివరి వారంలోనే అరెస్టు చేశారు. కోర్టు వారిని రిమాండ్‌కు పంపింది. అప్పటి నుంచి వారు జైల్లోనే ఉన్నారు. వారి ఇద్దరు పిల్లలను వర్జీనియాలోని శిశు సంక్షేమ అధికారుల సంరక్షణలో ఉంచారు. కిషన్ దంపతులకు బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు తిరస్కరించింది. వాస్తవానికి అమెరికాలో వ్యభిచారం చట్టవిరుద్ధమేమీ కాదని.. అయితే ఈ వ్యవహారంలో పిల్లలు ఉన్నా, మహిళల అక్రమ రవాణా వంటివి ఉన్నా సీరియస్‌గా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు. షికాగో పోలీసులు కిషన్ దంపతులపై తీవ్రమైన అభియోగాలే నమోదు చేశారని వెల్లడిస్తున్నారు.
విచారణకు సహకరించని బాధితులు
ఈ కేసు విచారణకు బాధితులు సహకరించడం లేదని అమెరికన్ పోలీసులు చెబుతున్నారు. ఓ బాధితురాలిని విచారించగా.. తాను వ్యభిచారం చేయలేదని, కొంతసేపు వారితో సరదాగా మాట్లాడానని, వారు తన ‘సాయం’కోరారని చెప్పింది. ఇక ఓ విటుడు తాను కిషన్ భార్య చంద్రతో మాట్లాడానని.. నటీమణులతో వ్యభిచరించేందుకు ఎంత ఖర్చవుతుందని మాత్రమే అడిగానని, అంతకుమించి ఏమీ లేదని పోలీసులకు వెల్లడించాడు. కానీ అతను షికాగో విమానాశ్రయంలోని ఓ సూట్‌లో చంద్రను కలసి, ఓ నటితో వ్యభిచరించేందుకు 1,110 డాలర్లు చెల్లించినట్టుగా తేలిందని ఫెడరల్ పోలీసులు కోర్టుకు ఇచ్చిన దర్యాప్తు నివేదికలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment