సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌లో తలదాచుకున్న అంతర్జాతీయ డాన్ దావూద్ ఇబ్రహీం కన్ను హైదరాబాద్‌పై ఉందా? దీనికి ఔననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దావూద్‌కు చెందిన డి–కంపెనీ హైదరాబాద్‌లో ఉండే ఓ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్లు తెలిసింది. దీనికోసం దావూద్ కుడిభుజం ఛోటా షకీల్ ఢిల్లీకి చెందిన షార్ప్ షూటర్ నసీం అలియాస్ రిజ్వాన్‌ను రంగంలోకి దింపాడు. నసీంను నార్త్‌ఈస్ట్ ఢిల్లీ పోలీసులు నవంబర్‌లో అరెస్టు చేశారు. నసీం విచారణ నేపథ్యంలో ‘హైదరాబాద్ సెలబ్రిటీ–డి కంపెనీ’ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు దర్యాప్తులో ఉందని చెప్తుండగా.. తెలంగాణ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు.
టార్గెట్ నేపథ్యంలో..
నసీం
ఢిల్లీలో జరిగిన అనేక దోపిడీ, దొంగతనం, హత్యలు, హత్యాయత్నం నేరాల్లో నిందితుడిగా.. మరికొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న నసీం కోసం ఢిల్లీ పోలీసులు కొన్నాళ్లుగా గాలిస్తున్నారు. అతడిపై రూ.50 వేల రివార్డ్ ప్రకటించారు. షార్ప్ షూటర్‌గా పేరున్న నసీం డి–కంపెనీకి అనుబంధంగా పని చేస్తున్నాడని, దావూద్‌తో పాటు ఛోటా షకీల్ ఆదేశాల మేరకు కొందరు ప్రముఖుల్ని చంపడానికి రంగంలోకి దిగాడని ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో గతేడాది జూన్‌లో నార్త్‌ఈస్ట్ ఢిల్లీ పోలీసులు నసీం అనుచరుడు జునైద్ చౌదరిని అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో నవంబర్ మొదటి వారంలో నసీంను పట్టుకున్నారు.
వెలుగులోకి కీలకాంశాలు..
ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల విచారణలో నసీం తాను ఛోటా. షకీల్ ఆదేశాల మేరకు కొందరు ప్రముఖుల్ని టార్గెట్ చేసినట్లు అంగీకరించాడు. పాక్‌లో పుట్టి కెనడియన్‌గా మారిన రచయిత తారిఖ్ ఫథాతో పాటు ‘కాఫీ విత్ డీ’ సినిమా నిర్మాత మరికొందరు సెలబ్రిటీలు ఉన్నట్లు బయటపెట్టాడు. తారిఖ్ ఢిల్లీ వచ్చిన సందర్భంలో ఆయన్ను హతమారిస్తే రూ.1.5 కోట్లు చెల్లించడానికి షకీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపాడు. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ కదలికల్నీ కనిపెట్టాల్సిందిగా షకీల్ చెప్పాడనీ అంగీకరించాడు. షకీల్–రాజన్ మధ్య వైరం ఉన్న నేపథ్యంలో అతడిని హతమార్చడానికి రెక్కీగా ఈ ఆదేశాలు ఇచ్చినట్లు స్పెషల్ సెల్ అనుమానిస్తోంది. షకీల్ రెండుసార్లు నసీంతో మాట్లాడి ఈ కాంట్రాక్టులు ఇచ్చినట్లు వెల్లడైంది.
రూ. 45 లక్షల సుపారీ
ఛోటా షకీల్
నసీం విచారణలో హైదరాబాద్‌కు సంబంధించిన కోణం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఉంటున్న ఓ సెలబ్రిటీని చంపేందుకు షకీల్ నుంచి అతడు రూ.45 లక్షల సుపారీకి అంగీకరించాడని వెల్లడైనట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ మున్నా సింగ్‌తో కలసి చేయాల్సిందిగా షకీల్ స్పష్టం చేసినట్లు స్పెషల్ సెల్ గుర్తించింది. దీనికోసం గుర్గావ్ ప్రాంతంలో మున్నాను కలిసే యత్నాల్లో ఉండగా నసీం ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ సెల బ్రిటీ ఎవరు? అతడిని టార్గెట్ చేయాల్సిన అవసరం డి–కంపెనీకి ఎందుకు వచ్చింది? అనేవి అంతు చిక్కట్లేదు.
గతంలోనే సిటీలో డి–గ్యాంగ్ ఛాయలు కనిపించాయి. ఓ వీడియో కంపెనీ యజమానుల్ని దుబాయ్ కు పిలిపించుకుని వారిని కలిసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ విషయంపై ‘సాక్షి’ ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల్ని సంప్రదించగా.. నసీం కేసు దర్యాప్తులో ఉందని, అనేక అంశాలు వెలుగులోకి రావాలని చెప్పారు. తెలంగాణ, హైదరాబాద్ పోలీసులు మాత్రం సిటీ సెలబ్రిటీని డి–కంపెనీ టార్గెట్ చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment